మహబూబాబాద్, జూన్ 14(నమస్తే తెలంగాణ) : మహబూబాబాద్ జిల్లాలో(Mahabubabad) ఘోర రోడ్డు ప్రమాదం(Road accident) జరిగింది. శుక్రవారం ఉదయం మహబూబాబాద్ నుంచి నర్సంపేట కట్టెల లోడుతో వెళ్తున్న లారీ గూడూరు మండల కేంద్రంలో మూలమలుపు వద్ద టర్న్ అవుతుండగా బోల్తా పడింది(Lorry overturns). అదే సమయంలో అక్కడే రోడ్డుపై నిలిచి ఉన్న గూడూరు పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న కానిస్టేబుల్ దనసరి పాపారావు, సీఆర్టీ టీచర్ చించ దేవేందర్‌పై పడటంతో అక్కడికక్కడే మృతి చెందారు.
మరో వ్యక్తికి గాయాలు కాగా అతడిని గూడూరు హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. లారీ డ్రైవర్, లారీ క్లీనర్ ఇద్దరు అక్కడి నుంచి పరారయ్యారు. బాధితు కుటుంబాలకు న్యాయం చేయాలని గిరిజన సంఘాలు వచ్చి రోడ్డుపై పైఠాయించి ధర్నా నిర్వహించారు. సంఘటన స్థలాన్ని జిల్లా ఎస్పీ రామ్ నాద్ కేకన్ పరిశీలించారు. ప్రమాదం జరిగిన తీరును స్థానిక పోలీసుల నుంచి అడిగి తెలుసుకున్నారు. అనంతరం రోడ్డుపై పడి ఉన్న కట్టెల లారీ క్లియర్ చేయించి, ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా చూశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.