ఖానాపురం మార్చి 13 : రోడ్డు ప్రమాదంలో కారు బోల్తా(Car accident) పడి అక్క, చెల్లెలు మృతి చెందిన సంఘటన ఖానాపురం మండల కేంద్రం శివారులోని పెట్రోల్ పంపు సమీపంలో గురువారం జరిగింది. ఎస్ఐ రఘుపతి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. వరంగల్ జిల్లా ఖిలా వరంగల్‌కు చెందిన ఏసిరెడ్డి యశోద (80), బోలుగొడ్డు మాణిక్యమ్మ (78) మరో ముగ్గురు తమ కుటుంబ సభ్యులతో కలిసి కారులో మహబూబాబాద్ జిల్లా కొరివిలో తమ సమీప బంధువు దశదినకర్మ వేడుకలకు హాజరయ్యారు.
కార్యక్రమం ముగిసిన అనంతరం తిరిగి ఖిలా వరంగల్ఖు వెళుతుండగా ఖానాపురం శివారు పెట్రోల్ బంకు సమీపంలోకి రాగానే కారు వెనుక టైరు పేలి అదుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఏసిరెడ్డి యశోద, బోలుగొడ్డు మాణిక్యమ్మ తీవ్రంగా గాయపడ్డారు. రమేష్ ,హరీష్ అనితలకు స్వల్ప గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు 108లో నర్సంపేట ఏరియా హాస్పిటల్‌కు తరలించారు. కాగా, అప్పటికే యశోద, మాణిక్యమ్మ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఒకే కుటుంబానికి చెందిన అక్క, చెల్లెలు ఇద్దరు ఒకేసారి రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి.