వెల్దండ/ రంగారెడ్డి, డిసెంబర్ 9 (నమస్తే తెలంగాణ): లంచం తీసుకుంటూ ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులు ఏసీబీకి చిక్కారు. నాగర్‌కర్నూల్ జిల్లా వెల్దండ మండలం చొక్కన్నపల్లి శివారులోని వ్యవసాయ పొలంలో నిర్మించుకున్న ఇంటికి కరెంట్ కనెక్షన్ కోసం ఇన్చార్జి ఏఈ వెంకటేశ్వర్లును ఓ రైతు సంప్రదించాడు. ఇందుకు రూ.20 వేలు లంచం ఇవ్వాలని ఏఈ డిమాండ్ చేయగా.. రూ.15 వేలకు ఒప్పందం కుదిరింది. మంగళవారం పొలం వద్ద రైతు డబ్బులు ఇస్తుండగా.. నల్లగొండ ఏసీబీ డీఎస్పీ జగదీశ్వర్ ఆధ్వర్యంలో అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
రంగారెడ్డిజిల్లాలో సివిల్ సప్లయ్ డీటీగా పనిచేస్తున్న హనుమా రవీందర్‌నాయక్ షాద్‌నగర్ నియోజకవర్గంలోని ఫారుక్‌నగర్ మండలం అన్నారం గ్రామానికి చెందిన రేషన్‌డీలర్ నుంచి రూ.20వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు. అన్నారం రేషన్‌డీలర్‌పై విజిలెన్స్ కేసు నమోదు కాగా ..రేషన్‌షాపు మళ్లీ ఇవ్వడంకోసం డీటీ రూ. 20 వేలు డిమాండ్ చేశారు. షాద్‌నగర్‌లోని ఓ హోటల్లో సదరు డీలర్ నుంచి డీటీ లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. వీరిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపర్చారు.