మహబూబాబాద్ : ఈత సరదా రెండు ప్రాణాలను బలితీసుకుంది. అప్పటి వరకు ఆడుతూ పాడుతూ తిరిగిన చిన్నారులు కొద్ది సేపట్లోనే విగతజీవులుగా మారడంతో రెండు కుటుంబాల్లో తీరని శోకాన్ని మిగిలిచ్చింది. ఈ విషాదకర సంఘటన జిల్లాలోని కేసముద్రం మండలం దుబ్బ తండాలో చోటుచేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. ఎస్సారెస్పీ డీబీఎం -48 కాలువలో ఈత కొట్టేందుకు వెళ్లి ఇద్దరు బాలికలు మృతి చెందారు. మరో ఇద్దరిని స్థానికులు రక్షించారు.
కాగా, బాలికలు కాలువ పై గడ్డ పారతో తవ్వి గుంజను నాటారు. ఆ గుంజకు తాడు కట్టి కాలువలో దిగి ఈత కొట్టాలని నిర్ణయించారు. తాడు సాయంతో దిగుతుండగా తాడు తెగి నలుగురు బాలికలు నీళ్లలో పడ్డారు. ఇందులో రమ్య శ్రీ (9), వాసంతి (12) ఇద్దరు బాలికలు నీటి ప్రవాహానికి కొట్టుకు పోయి మృతి చెందారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను పరిశీలించారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. ఇద్దరి బాలికల మృతితో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి.