హైదరాబాద్, ఫిబ్రవరి 15 (నమస్తే తెలంగాణ): రాష్ట్రం నుంచి రాజ్యసభకు ఖాళీ అయిన మూడు స్థానాలకు నామినేషన్లు వేసే గడువు గురువారంతో ముగిసింది. అధికార కాంగ్రెస్ నుంచి ఇద్దరు, ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ నుంచి ఒకరు నామినేషన్లు దాఖలు చేశారు. మూడు స్థానాలకు ముగ్గురే నామినేషన్లు వేయడంతో వారి ఎన్నిక ఇక లాంఛనం కానున్నది. మరో ఇద్దరు అభ్యర్థులు కూడా నామినేషన్లు వేసినప్పటికీ నిబంధనల ప్రకారం వారిని ప్రతిపాదించే ఎమ్మెల్యేలు లేకపోవడంతో అవి చెల్లుబాటయ్యే అవకాశం లేదు. నామినేషన్ల పరిశీలన అనంతరం వాటిని తిరస్కరించనున్నారు. ఈ నెల 20న నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసాక ముగ్గురు అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు రిటర్నింగ్ అధికారి అధికారికంగా ప్రకటించనున్నారు.
అధికార కాంగ్రెస్ పార్టీ నుంచి రెండు స్థానాలకు కేంద్ర మాజీ మంత్రి రేణుకాచౌదరి, హైదరాబాద్ డీసీసీ అధ్యక్షుడు అనిల్‌కుమార్ యాదవ్ నామినేషన్లు దాఖలు చేశారు. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు, సీఎం రేవంత్‌రెడ్డి, ఏఐసీసీ రాష్ట్ర ఇన్చారిర్జీ దీపాదాసు మున్షీ సమక్షంలో వారు తమ నామినేషన్లను ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఉపేందర్‌రెడ్డికి అందజేశారు. మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వర్రావుతో పాటు పలువురు ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమానికి హాజరై అభ్యర్థులకు శుభాకాంక్షలు చెప్పారు.
బీఆర్ఎస్ పార్టీ నుంచి వద్దిరాజు రవిచంద్ర నామినేషన్ వేశారు. మొదట ఆయన తెలంగాణభవన్‌లో ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి అక్కడి నుంచి ర్యాలీగా బయలుదేరి గన్‌పార్క్‌కు చేరుకున్నారు. అమరవీరుల స్థూపానికి నివాళులు ఆర్పించిన అనంతరం శాసనసభ ఆవరణలో ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రం అందజేశారు. వద్దిరాజు వెంట పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు, ఎమ్మెల్యేలు హరీశ్‌రావు, కడియం శ్రీహరి, వేముల ప్రశాంత్‌రెడ్డి, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, తెల్లం వెంకట్రావ్, దానం నాగేందర్ ఇతర నాయకులు ఉన్నారు. వీరందరితోపాటు వద్దిరాజు రవిచంద్రకు శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్, ఎమ్మెల్సీలు కల్వకుంట్ల కవిత, మధుసూదనాచారి, మహమూద్ అలీ, సత్యవతి రాథోడ్, తాతా మధు, శేరి సుభాష్‌రెడ్డి, దేశపతి శ్రీనివాస్, దండే విఠల్ తదితరులు శుభాకాంక్షలు తెలిపారు. మున్నూరు కాపు సంఘం రాష్ట్ర నాయకులు కొండా దేవయ్య, ఆకుల గాంధీ, ఎర్రా నాగేందర్ శాలువ కప్పి, పుష్పగుచ్చం అందజేశారు.