రేగొండ/సంగెం, మార్చి 14 : పంటకు నీరందించే క్రమంలో కరెంట్ షాక్కు గురై ఇద్దరు రైతులు మృతి చెందారు. ఈ విషాదకర ఘటనలు ఉమ్మడి వరంగల్ జిల్లాలో చోటుచేసుకున్నాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా గోరికొత్తపల్లి మండలం వెంకటేశ్వరపల్లెకు చెందిన ఇట్టవేన రవి (50)తనకున్న 4 ఎకరాల్లో మిర్చి, మక్క సాగుచేశాడు. బోరుబావిలో జలాలు అడుగంటడంతో పంటలు ఎండిపోతున్నాయి.
గురువారం నుంచి ఎస్సారెస్పీ డీబీఎం-38 కాలువ ద్వారా సాగు నీరు విడుదల చేస్తున్నట్టు అధికారులు ప్రకటించారు. అదేరోజు ఎస్సారెస్పీ కాలువపై కరెంట్ మోటర్ బిగించిన రవి పంట చేను వద్దకు పైపులు వేశాడు. అర్ధరాత్రి మోటర్ ఆన్ చేయగా నీళ్లు రాలేదు. కాలువలోకి దిగి పైపు వద్ద చెత్తాచెదారాన్ని తొలగిస్తుండగా విద్యుత్తు సరఫరాతో షాక్కు గురై మృతి చెందాడు.
సంగెం మండలం వీఆర్ఎన్ తండాకు చెందిన గుగులోత్ సురేశ్ (27) మక్క సాగు చేశాడు. శుక్రవారం చేనుకు నీళ్లు పెట్టేందుకు మోటర్ ఆన్చేయగా స్టార్ట్ కాలేదు. ఫ్యూజుల పరిశీలనకు స్టార్టర్ బాక్స్ తెరవగా షాక్కు గురయ్యాడు. పక్కనే ఉన్న రైతులు గమనించి దవాఖానకు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతిచెందాడు.