ధరూరు/ఇచ్చోడ(గుడిహత్నూర్), జూలై 10 : పొలం పనులు చేస్తుండగా కరెంట్ షాక్ కొట్టి ఇద్దరు రైతులు మృతిచెందారు. ఈ ఘటనలు జోగుళాంబ గద్వాల, ఆదిలాబాద్ జిల్లాల్లో చోటుచేసుకున్నాయి. వివరాలు ఇలా ఉన్నాయి. గద్వాల జిల్లా ధరూరు మండలం నెట్టెంపాడుకు చెందిన రైతు కుర్వ ఈశ్వరయ్య (45) వరి నాటు వేయడానికి కరిగెట పనులు చేస్తున్నాడు. ఇతని పొలానికి ఆనుకొని పక్కనున్న పొలానికి చుట్టూ ఫెన్సింగ్ ఉన్నది. కరిగెట నుంచి బురద, తడిచిన కాళ్లు, చేతులతో ప్రమాదవశాత్తు ఫెన్సింగ్‌ను పట్టుకొన్నాడు. అప్పటికే బోరు స్టార్టర్ వైర్ తెగి ఫెన్సింగ్‌పై పడటంతో విద్యుత్తు సరఫరా జరిగి రైతు అక్కడికక్కడే మృతి చెందాడు.
కాగా ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలం మన్నూర్ గ్రామంలో రైతు సిందే మారుతి (31) కరెంట్ షాక్‌తో మరణించాడు. మారుతి తన తమ్ముడు సిందే దీపక్‌తో కలిసి గడ్డి మందు కొట్టేందుకు పొలానికి వెళ్లారు. మారుతి నీళ్ల మోటర్ ఆన్ చేసి వస్తానని తమ్ముడికి చెప్పి వెళ్లాడు. ఎంత సేపైనా రాకపోవడంతో దీపక్ వెళ్లి చూడగా మారుతి మోటర్ వద్ద పడి ఉన్నాడు. వెంటనే రిమ్స్‌కు తీసుకెళ్లగా పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్టు తెలిపారు. మారుతికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.