దుబ్బాక/ వర్ధన్నపేట, అక్టోబర్ 17: అప్పుల బాధతో వేర్వేరు జిల్లాల్లో ఇద్దరు రైతులు ఆత్మహత్యకు పాల్పడిన ఘటనలు గురువారం చోటు చేసుకున్నాయి. సిద్దిపేట జిల్లా అక్బర్పేట-భూంపల్లి మండలం తాళ్లపల్లికి గ్రామానికి చెందిన వెల్పుల అంజయ్య(51) తనకున్న ఎకరంతోపాటు మరో రెండెకరాల భూమిని కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తున్నాడు. వ్యవసాయం, ఇతర అవసరాల కోసం చేసిన అప్పులు పెరిగిపోవడంతో మానసికంగా కుంగిపోయిన అంజయ్య గురువారం పొలం వద్ద చెట్టుకు ఉరి వేసుకున్నాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేపట్టినట్టు భూంపల్లి ఎస్సై హరీశ్ వెల్లడించారు. వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలంలోని కొత్తపల్లి గ్రామానికి చెందిన పోశాల రాజబాబు(45) మూడెకరాల భూమిని కౌలుకు తీసుకొని పత్తి సాగు చేస్తున్నాడు. గతేడాది, ఈ ఏడాది కూడా పంట దిగుబడి రా కపోవడంతో సుమారు రూ.15లక్షల దాకా అప్పులయ్యాయి. దీనికి తోడు పంటకు గిట్టుబాటు ధర కూడా రాకపోవడంతో అప్పులు ఎలా చెల్లించా లో తెలియక తీవ్ర మనోవేదనకు గురవుతున్నాడు. బుధవారం రాత్రి ఇంటి నుంచి వెళ్లిన రాజబాబు.. గురువారం ఉదయం గ్రామ సమీపంలో చెట్టుకు ఉరివేసుకున్నట్టు స్థానికులు గుర్తించి వారి కుటుంబ సభ్యులకు సమాచా రం అందించారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.