ముస్తాబాద్/వర్ధన్నపేట, సెప్టెంబర్ 16: అప్పుల బాధతో ఇద్దరు రైతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటనలు రాజన్న సిరిసిల్ల, వరంగల్ జిల్లాల్లో చోటుచేసుకున్నాయి. వివరాలు ఇలా.. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలోని సేవాలాల్ తండాకు చెందిన భూక్య శంకర్ నాయక్ (55)కు భార్య, ఇద్దరు కూతుర్లు, ఒక కొడుకు ఉన్నారు. ఇద్దరు కూతుర్ల పెండ్లిళ్లు గతంలోనే చేశాడు. ఆయనకు నాలుగెకరాల పొలం ఉన్నది. అందులో వరి సాగు వేయగా సరైన దిగుబడి రాలేదు. రెండేండ్ల క్రితం ఇల్లు కట్టుకున్నాడు. అప్పుడు రూ.5 లక్షల దాకా అప్పు చేశాడు. అప్పటి నుంచి అప్పులు ఎలా కట్టాలో తెలియక ఆందోళన చెందుతున్నాడు. మంగళవారం రాత్రి ఇంట్లో నుంచి పొలానికి వెళ్లి బావి వద్ద చెట్టుకు ఉరేసుకొన్నాడు. విషయం తెలిసిన వెంటనే కుటుంబ సభ్యులు వెళ్లగా, అప్పటికే మృతి చెందాడు. శంకర్ నాయక్ కొడుకు గంగరాజు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
యూరియా కోసం వారం రోజులు తిరిగినా దొరక్కపోవడంతో విసిగి వేసారిన యువరైతు ఆవేదనతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషాదకర ఘటన వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం రామవరంలో జరిగింది. బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. రామవరం గ్రామానికి చెందిన ఉడుత అఖిల్ (22) వ్యవసాయ పనులు చేస్తూ కుటుంబానికి ఆసరాగా ఉన్నాడు. ఐదేండ్ల క్రితం తండ్రి గట్టయ్య మృతి చెందడంతో అఖిల్ వ్యవసాయం చేస్తుండగా సోదరుడు రాకేశ్ హైదరాబాద్లో ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నాడు. తనకున్న మూడున్నర ఎకరాల్లో మక్కజొన్న, పత్తి, వరి సాగు చేస్తున్నాడు. పంటలకు పెట్టుబడిగా రూ.5 లక్షల మేరకు అప్పులు చేశాడు. వారం రోజుల నుంచి యూరియా బస్తాల కోసం మండల కేంద్రంతోపాటు సమీపంలోని దమ్మన్నపేటలోని విక్రయ కేంద్రం చుట్టూ తిరుగుతున్నాడు.
వ్యవసాయ బావి వద్దకు వెళ్లకపోవడంతో కోతులు మక్కజొన్న, పత్తిని పాడు చేశాయి. ఆర్థికఇబ్బందుల్లో ఉన్న అఖిల్ అప్పులు ఎలా తీర్చాలో తెలియక రెండు రోజులుగా తల్లితో చెప్పుకుంటూ మానసికంగా ఇబ్బందికి గురయ్యాడు. ఈ క్రమంలో మంగళవారం మధ్యాహ్నం వ్యవసాయ బావి వద్దకు వెళ్లిన అఖిల్ గడ్డిమందు తాగి పంట చేనులోనే పడిపోయాడు. సాయంత్రం వరకూ ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు బావి వద్ద వెతకడంతో అఖిల్ స్పృహ కోల్పోయి ఉన్నాడు. వెంటనే వర్ధన్నపేట ఏరియా దవాఖానకు తరలించడంతో అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు.