మంగపేట/బేల, ఏప్రిల్ 13 : సాగు కోసం చేసిన అప్పులు ఎలా తీర్చాలో తెలియక ఇద్దరు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. వడగండ్ల వానతో 27 ఎకరాల్లో నేలరాలిన పంట వద్దనే ఓ రైతు దిగాలుతో పురుగుమందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. దిగుబడి సక్రమంగా రాకపోవడం, రుణమాఫీ కూడా కాకపోవడం, రైతుభరోసాను బ్యాంకు అధికారులు జమచేసుకోవడంతో అప్పులు ఎలా తీర్చాలనే బెంగతో మరో రైతు పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ రెండు ఘటనలు ఆదివారం ములుగు, ఆదిలాబాద్ జిల్లాల్లో చోటు చేసుకున్నాయి.
ములుగు జిల్లా మంగపేట మండలం మల్లూరు పంచాయతీ పరిధిలోని మొట్లగూడెం గ్రామానికి చెందిన యాలం నర్సింహారావు(45) తనకున్న ఐదెకరాల పొలంతోపాటు మరో 22 ఎకరాల పొలం కౌలుకు తీసుకున్నాడు. పంటలు చేతికొచ్చాక ఈ నెల 7న కురిసిన భారీ వడగండ్ల వానకు అన్ని పంటలు పూర్తిగా నేలపాలయ్యాయి. తీవ్ర మనస్తాపానికి గురైన నర్సింహారావు ఈ నెల 10న దెబ్బతిన్న చేను వద్దనే పురుగు మందు తాగాడు. నర్సింహారావు హనుమకొండలోని ఓ ప్రైవేట్ దవాఖానలో చికిత్సపొందుతూ ఆదివారం మృతి చెందాడు. నర్సింహారావు కుటుంబానికి ప్రభుత్వం రూ.కోటి ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని మాజీ ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి డిమాండ్ చేశారు.
అప్పు కింద రైతుభరోసా జమతో..
ఆదిలాబాద్ జిల్లా దౌన గ్రామానికి చెందిన రైతు రాథోడ్ అరవింద్(35) తనకున్న నాలుగెకరాల్లో పత్తి, కం ది సాగు చేశాడు. సాగు కోసం రూ. 3లక్షలు అప్పు చే శాడు. అతడికి రు ణమాఫీ కూడా కా లేదు. దీనికితోడు తన తండ్రి హన్సింగ్కు రామాయి గ్రా మంలోని బ్యాంకులో కొంత అప్పు ఉండగా.. అరవింద్‌కు వచ్చిన రైతుభరోసా నగదును కూడా తన తండ్రి అప్పు కింద బ్యాంకు అధికారులు జమ చేసుకున్నారు. అప్పులు ఎలా తీర్చాలనే బెంగతో శనివారం రాత్రి ఇంట్లోనే పురుగుమందు తాగాడు. ఆదిలాబాద్‌లోని రిమ్స్‌కు తరలిస్తుండగా మార్గంమధ్యలో మృతిచెందాడు.