Yadagirigutta | యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామివారి బంగారం, వెండి డాలర్ల మాయంపై నమస్తే తెలంగాణ లో బుధవారం ‘గుట్ట ప్రచార శాఖలో డాలర్ల మాయం’ అనే శీర్షికతో ప్రచురించిన కథనం పెనుసంచలనంగా మారింది. ప్రచారశాఖలో విక్రయించే బంగారం, వెండి డాలర్లు మాయ మై ఏడాది కావొస్తున్నా పట్టించుకోకపోవడం.. తాజాగా ‘నమస్తే తెలంగాణ’ వెలుగులోకి తీసుకురావడంతో ఈవో భవానీ శంకర్ ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి విచారణకు ఆదేశించారు. ఆ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా విధుల్లో నిర్లక్ష్యం వహించిన ఇద్దరిని సస్పెండ్ చేశారు.
ప్రచార శాఖలో విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన జూనియర్ అసిస్టెంట్ పి.రామచంద్ర శేఖర్, రికార్డ్ అసిస్టెంట్ టి.లక్ష్మీని సస్పెండ్ చేస్తూ ఈవో ఉత్తర్వులు జారీ చేశారు. పర్యవేక్షకులు కె.నటరాజు, సీతారామాచార్యులకు చార్జి మెమోలు జారీ చేశారు. అలాగే ఏఈవోకు షోకాజ్ నోటీసులు ఇచ్చారు.