చేవెళ్ల రూరల్, ఏప్రిల్ 14 : రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మున్సిపల్ పరిధిలోని దామరిగిద్ద గ్రామంలో కారు డోర్ లాక్ కావడంతో ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. దామరగిద్దకు చెందిన తెలుగు జంగయ్య కొడుకు రాంబాబు వివాహం ఈ నెల 30న నిశ్చయమైంది. దీంతో ఆయన అల్లుళ్లు, కూతుళ్లు చేవెళ్ల మండలం పామెన గ్రామానికి చెందిన కావలి వెంకటేశ్ -జ్యోతి దంపతులు, వారి కుమార్తె తన్మయిశ్రీ (5), షాబాద్ మండలం సీతారాంపూర్కు చెందిన మహేందర్-ఉమారాణి దంపతులు, వారి కుమార్తె అభినయశ్రీ (4) దామరిగిద్దకు వచ్చారు.
సోమవారం కుటుంబ సభ్యులు, బంధువులు పెళ్లి కార్డులు సెట్ చేస్తుండగా.. మధ్యాహ్నం 12:30 గంటల సమయంలో పిల్లలిద్దరూ ఆడుకుంటూ బయటికివెళ్లారు. ఇంటి ఎదుట ఉంచిన మేనమామకు చెందిన ఆల్టో కారులో ఎకి ఆడుకుంటుండగా డోర్ లాక్ అయ్యింది. కుటుంబ సభ్యులు గమనించకపోవడంతో అందులోనే ఉండిపోయారు. మధ్యాహ్నం 2 గంటల సమయంలో పిల్లలు కనిపించకపోవడంతో బయటకు వచ్చి చూడగా.. కారులో సృ్పహ తప్పి పడి కనిపించారు. వెంటనే లాక్ తీసి చేవెళ్ల ప్రభుత్వ దవాఖానకు తరలించగా పరీక్షించిన వైద్యులు చిన్నారులు అప్పటికే మృతి చెందినట్టు నిర్ధారించారు.