మల్యాల, అక్టోబర్ 16 : జగిత్యా ల జిల్లా మల్యాల మండలం కొండగట్టు అంజన్న ఆలయ ప్రాంగణంలో ఇద్దరు భక్తులు గురువారం విద్యుత్తు షాక్కు గురయ్యారు. తీవ్రంగా గాయపడిన మహిళను దవాఖానకు తరలించగా పరిస్థితి విషమించి మృతిచెందింది. మల్యాల ఎస్ఐ నరేశ్ తెలిపిన వివరాలు.. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనికి చెందిన వెనగంటి సత్యనారాయణ కుటుంబ సభ్యులతో బుధవారం వేములవాడ రాజన్న దర్శనం చేసుకుని అక్కడే బసచేసి, గురువారం ఉదయం ఆంజనేయస్వామి సన్నిధానానికి చేరుకున్నారు.
సత్యనారాయణ తల్లి రాజేశ్వరి(84), భార్య సరిత కాలకృత్యాల కోసం గుట్టపైనమరుగుదొడ్ల వద్దకు వెళ్లగా, అక్కడ ఇనుపజాలీని ముట్టుకోగా షాక్తో రాజేశ్వరి సొమ్మసిల్లి పడిపోగా, సరిత గాయపడింది. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు మల్యాల ఎస్ఐ తెలిపారు. ఘటన విచారకరమని చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ఆవేదన వ్యక్తం చేశారు. బాధిత కుటుంబానికి రూ.20 లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించాలని కోరారు.