TG Weather | తెలంగాణలో రాగల రెండురోజుల్లో వడగళ్ల వానలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేందం హెచ్చరించింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో హెచ్చరికలను జారీ చేసింది. గురువారం ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, నిజామాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో అక్కడక్కడ వడగళ్లు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాది భువనగిరి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాలకు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వానలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది.
శుక్రవారం ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, నల్గొండ, సూర్యాపేట, హన్మకొండ, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మల్కాజ్గిరి, వికారాబాద్, జనగాం, మహబూబాబాద్, నాగర్ కర్నూల్, నారాయణపేట, గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, ఈదురుగాలులతో కూడిన వానలు పడే ఛాన్స్ ఉందని పేర్కొంది. ఆయా జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది. ఇదిలా ఉండగా.. హైదరాబాద్‌తో పాటు తెలంగాణ వ్యాప్తంగా పలు చోట్ల గురువారం మధ్యాహ్నం నుంచి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిశాయి. వర్షాల కారణంగా వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. నిన్నా మొన్నటి వరకు ఎండలు దంచికొట్టిన విషయం తెలిసిందే. హైదరాబాద్ నగరంలో ఒక్కసారిగా వర్షం కురవడంతో వాతావరణం చల్లగా మారింది.