దుబ్బాక, డిసెంబర్ 5: అభ్యర్థిని నిర్ణయించడంలో కాంగ్రెస్ స్థానిక నాయకుల నిర్వాకం బెడిసికొట్టింది. ధర్మచిట్టీతో నిర్ణయించడంతో వ్యతిరేకంగా వచ్చిన అభ్యర్థి దవాఖాన పాలైన ఘటన చోటుచేసుకున్నది. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం రామక్కపేట గ్రామ పంచాయతీ సర్పంచ్ స్థానం బీసీ జనరల్ రిజర్వేషన్ వచ్చింది. అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన డీసీసీబీ డైరెక్టర్ పూస దశరథం, దుబ్బాక పీఏసీఎస్ డైరెక్టర్ గజబీంకార్ బాలరాజు ఆ పార్టీ తరఫున పోటీపడుతున్నారు. కాంగ్రెస్ మద్దతు ఇచ్చేందుకు ఓ మంత్రి సైతం జోక్యం చేసుకున్నట్టు సమాచారం. రాజీకుదుర్చే ప్రయత్నాలు మరో సమస్యకు దారితీసింది. రెండు రోజుల కిందట స్థానిక ఆలయంలో ఇద్దరు అభ్యర్థులను పిలిచి వారి పేర్లతో కాంగ్రెస్ పార్టీ నేతలు ధర్మ చిట్టీలు వేశారు. వచ్చిన వారు మాత్రమే పోటీ చేయాలని ఒప్పందం కుదిర్చారు.
ధర్మ చిట్టీలో పూస దశరథం పేరు రావడంతో అతనే పోటీ చేయాలని, బాలరాజు పోటీనుంచి తప్పుకోవాలని నాయకులు సూచించినట్టు తెలిసింది. శనివారం నామినేషన్ను ఉపసంహరించుకోవాలని బాలరాజుకు సూచించారు. ఈ క్రమంలో తీవ్ర ఒత్తిడికి లోనైన బాలరాజు శుక్రవారం వేకువజామున గుండెపోటుతో దవాఖాన పాలయ్యాడు. హైదరాబాద్లోని ఓ ప్రైవేటు దవాఖానలో చికిత్స పొదుతున్నట్టు తెలిసింది. శనివారం మధ్యాహ్నం 3 గంటల్లోపు అభ్యర్థులు నామినేషన్ ఉపసంహరణ చేసుకునే అవకాశం ఉన్నది. దవాఖానలో ఉన్న అభ్యర్థితో విత్ డ్రా చేయించేందుకు ఆ పార్టీ పెద్దలకు తలనొప్పిగా మారింది.