పరకాల/కురవి, ఫిబ్రవరి 5: ఆశించిన దిగుబడులు రాక.. చేసిన అప్పులు తీర్చలేక తీవ్ర మనస్తాపం తో హనుమకొండ, మహబూబాబాద్ జి ల్లాలో ఇద్దరు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసులు, బాధిత కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. హనుమకొండ జిల్లా పరకాల మండలం పైడిపల్లికి చెందిన పసుల మొగిలి తనకున్న ఎకరన్నర పొలంలో సుమారు రూ.రెండు లక్షల వరకు అప్పు చేసి మిర్చి సాగు చేస్తున్నాడు. పంట దిగుబడి రాకపోవడంతో అప్పు ఎలా తీర్చా లో తెలియక మనస్తాపానికి గురయ్యాడు. ఈ నెల 1న ఇంట్లో వాళ్లు కూలీ పనికి వెళ్లగా, మొగిలి ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోయాడు. కాగా బుధవారం గ్రామ శివారులోని పొలం వద్ద పురుగుల మందు తాగి మృతి చెంది ఉన్నాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు.
హుమ్లాతండాలో మరో రైతు
మహబూబాబాద్ జిల్లా కురవి మం డలం తుల్స్యాతండా పంచాయతీ పరిధిలో ని హుమ్లాతండాకు చెందిన బానోత్ బాలకిషన్ (36) తనకున్న మూడెకరాల్లో ఎకరం వరి, రెండు ఎకరాల్లో మిర్చి సాగు చేశాడు. ఎకరం మిర్చి పంటకు రోగం రావడంతో తొ లగించి మక్కజొన్న వేశాడు. దిగుబడి రాక అప్పులు పెరిగాయి. సుమారు రూ.10 లక్షల అప్పు ఉంటుందని తండావాసులు తెలిపారు. ఆర్థిక సమస్యలతో కుంగిపోయి బుధవారం ఇంటి ఆవరణలో గడ్డిమందు తాగి ఆ త్మహత్యకు పాల్పడ్డాడు. వరంగల్ ఎంజీఎం కు తీసుకెళ్లగా చికిత్స పొందుతూ మృతి చెం దాడు. మృతుడికి భార్య జాను, కుమారుడు సంజయ్, కుమార్తె సంకీర్తన ఉన్నారు.
మగ్గం నేస్తూ నేత కార్మికుడి మృతి
పోచమ్మమైదాన్, ఫిబ్రవరి 5: నేత కార్మికుడు మగ్గం నేస్తూనే గుండెపోటుకు గురై మృతిచెందాడు. ఈ విషాదకర ఘటన వరంగల్లో బుధవారం చోటుచేసుకున్నది. నగరంలోని 12వ డివిజన్ సెకండ్ డాక్టర్స్ కాలనీలోని మైనార్టీ కాలనీకి చెందిన ఆడెపు కుమారస్వామి (32) రోజు మాదిరిగానే మగ్గం నేస్తుండగా అకస్మాత్తుగా గుండెనొప్పికి గురయ్యాడు. వెంటనే కుటుంబ సభ్యులు దవాఖానకు తరలిస్తుండగా మృతిచెందాడు. కుమారస్వామికి భార్య, మూడునెలల పాప ఉన్నది.