రఘునాథపాలెం/ గుండాల, అక్టోబర్ 6: వేర్వేరు చోట్ల విద్యుదాఘాతానికి గురై ఇద్దరు చిన్నారులు మృతిచెందిన ఘటనలు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఆదివారం చోటుచేసుకున్నాయి. ఖమ్మం రఘునాథపాలెం మండలం పాపటపల్లికి చెందిన మిట్టపల్లి చరణ్ తేజ్(15) పదో తరగతి చదువుతున్నాడు. బతుకమ్మ వేడుక కోసమని టేకు చెట్టు పైన ఉన్న పూలు కోసేందుకు డాబా పైకి ఎక్కాడు. పూలు కోస్తుండగా, పక్కనే ఉన్న విద్యుత్తు లైన్‌కు చేయి తగలడంతో షాక్‌కు గురై మృతిచెందాడు. అలాగే, భద్రాద్రి జిల్లా గుండాల మండ లం వెన్నెలబైలుకు చెందిన ఇర్ప సువర్ణ (12) ఇంటి రేకులకు ఉన్న ఫ్యాన్ వైరును పక్కకు తొలగించబోయింది. ఆ వైరును ఎలుకలు కొరికివేయడంతో దీనిని గమనించకుండా పట్టుకోవడంతో షాక్ తగలడంతో కుప్పకూలింది. దవాఖానకు తరలించగా అప్పటికే మృతి చెందింది.