నల్లగొండ ప్రతినిధి, మార్చి 25 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తోపాటు పార్టీ సోషల్ మీడియా ఇన్చార్జి మన్నె క్రిశాంక్, కొణతం దిలీప్‌కుమార్‌పై స్థానిక కాంగ్రెస్ నేతల ఫిర్యాదు మేరకు నకిరేకల్ పోలీస్‌స్టేషన్‌లో రెండు వేర్వేరు కేసులు నమోదయ్యాయి. నకిరేకల్‌లో పదో తరగతి తెలుగు పరీక్ష ప్రశ్నపత్రం లీక్ వ్యవహారంలో సోషల్ మీడియా వేదికగా తమపై తప్పుడు ప్రచారం చేశారంటూ మున్సిపల్ చైర్పర్సన్ చౌగోని రజిత, ఉగ్గిడి శ్రీనివాస్ వేర్వేరుగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఒక వెబ్సైట్లో వచ్చిన కథనాన్ని కేటీఆర్ ఎక్స్‌లో షేర్ చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో కేటీఆర్, మన్నె క్రిశాంక్, కొణతం దిలీప్‌కుమార్‌తోపాటు మరి కొందరిపై కేసు నమోదుచేసినట్టు పోలీసులు తెలిపారు. కాగా, ఈ పేపర్ లీక్ కేసులో పోలీసులు ఇప్పటివరకు ఒక మైనర్‌తోపాటు ఐదుగురిని అరెస్ట్ చేశారు. మరో ఆరుగురు పరారీలో ఉన్నట్టు తెలిపారు.