Hyderabad | హైదరాబాద్లోని మీర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం నెలకొంది. జీహెచ్ఎంసీ చెత్త ట్రాక్టర్ ఢీకొనడంతో ఇద్దరు ఆటో డ్రైవర్లు అక్కడికక్కడే దుర్మరణం చెందారు.
పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. మంద మల్లమ్మ చౌరస్తాలోని చంద్రా గార్డెన్స్ వద్ద సంతోష్ (26) అనే ఆటో డ్రైవర్ ఆటో రిపేర్ వచ్చి ఆగిపోయింది. దీంతో తన ఆటోను మెకానిక్ షాపునకు తీసుకెళ్లేందుకు సాయం కావాలని తన స్నేహితులు ప్రసాద్, సునీల్ (33)లకు ఫోన్ చేశాడు. వారు మరో ఆటోలో అక్కడకు వచ్చారు. సంతోష్ ఆటోను తమ ఆటోకు తాడుతో కట్టి తరలించేందుకు సునీల్, ప్రసాద్ సిద్ధమయ్యారు.
ఈ సమయంలో ఎల్బీనగర్ వైపు నుంచి వేగంగా దూసుకొచ్చిన జీహెచ్ఎంసీ చెత్త టిప్పర్.. రోడ్డు పక్కన ఆగివున్న ఆటోడ్రైవర్లను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సంతోష్ అక్కడిక్కడే మరణించాడు. గాయపడిన ఇద్దరిని ఆస్పత్రికి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ సునీల్ మృతిచెందాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.