హైదరాబాద్ : సరూర్‌నగర్‌లో పరువు హత్య కేసులో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. మోబిన్ అహ్మద్, మసూద్ అహ్మద్‌ను అరెస్టు చేసినట్లు ఎల్బీనగర్ డీసీపీ సంప్రీత్ సింగ్ పేర్కొన్నారు. ఇద్దరు కలిసి చంపినట్లు సీసీ కెమెరా దృశ్యాల్లో గుర్తించినట్లు పేర్కొన్నారు. మృతుడు నాగరాజు వికారాబాద్ జిల్లా స్టేషన్ మర్పల్లి వాసి అనీ, బాల్య స్నేహితుడైన నాగరాజు, అశ్రీన్ సుల్తానా ప్రేమించుకుంటున్నారన్నారు.
నాగరాజు, సుల్తానా జనవరిలో ప్రేమ వివాహం చేసుకున్నారని తెలిపారు. చెల్లిని పెళ్లి చేసుకున్నాడనే కోపంతో నాగరాజును చంపాడని, సుల్తానా అన్న మోబిన్, బంధువు మసూద్‌తో కలిసి నాగరాజును హత్య చేసినట్లు పేర్కొన్నారు. సయ్యద్ మోబిన్ నెల రోజులుగా నాగరాజు కోసం వెతుకుతూ సరైన సమయంలో కోసం వేచి చూశాడనీ.. ఈ క్రమంలో పథకం ప్రకారం బుధవారం రాత్రి సరూర్‌నగర్ చెరువు కట్ట వద్ద నాగరాజు దంపతులపై దాడి చేశారని డీసీపీ పేర్కొన్నారు.
ఐరన్ రాడ్‌తో కొట్టి.. కత్తితో దాడి చేశారని ఆయన పేర్కొన్నారు. 24 గంటల్లోనే నిందితులను అరెస్ట్ చేశామని.. వారిద్దరిని రిమాండ్‌కు పంపినట్లు వివరించారు. ఈ హత్యపై ఐపీసీ సెక్షన్ 302 కింద కేసులు పెట్టామని, హత్యలో ఐదుగురు వ్యక్తులు పాల్గొన్నట్లుగా జరుగుతున్న ప్రచారాన్ని డీసీపీ ఖండించారు. ఈ కేసులో మరింత దర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు.