హైదరాబాద్, సెప్టెంబర్ 1 (నమస్తే తెలంగాణ): నకిలీ బిల్లులు సమర్పించి సీఎంఆర్ఎఫ్ నిధులను స్వాహా చేసిన కేసులో పోలీసులు ఇద్దరిని అరెస్టు చేశారు. వారిలో మిర్యాలగూడలో ఆర్ఎంపీ వైద్యునిగా పనిచేస్తున్న గొట్టి గిరి, నవీన మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ సూపర్వైజర్ లేకిరెడ్డి సైదిరెడ్డి ఉన్నట్టు సీఐడీ డీజీ శిఖాగోయెల్ ఆదివారం వెల్లడించారు. వారి నుంచి పలు నకిలీ మెడికల్ బిల్లులు, రబ్బర్ స్టాంపులు, కంప్యూటర్లు, హార్డ్‌డిస్క్‌లు, ప్రింటర్లు, లెటర్హెడ్లను స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. నవీన మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్‌తోపాటు నల్లగొండలోని అమ్మ హాస్పిటల్ పేరుతో నిందితులు 19 నకిలీ బిల్లులతో ప్రభుత్వానికి దరఖాస్తులు పంపి డబ్బులు పొందారని, ఆ బిల్లులను తయారు చేసినవారికి రూ.4 వేల చొప్పున ఇచ్చారని పోలీసులు గుర్తించారు. నిందితులను నల్లగొండలోని స్పెషల్ మొబైల్ కోర్టులో హాజరుపర్చి, రిమాండ్ కోరామని, ఈ కుంభకోణంలో ప్రమేయం ఉన్న ఇతర నిందితుల కోసం ఆరా తీస్తున్నామని శిఖాగోయెల్ తెలిపారు.
అబిడ్స్, సెప్టెంబర్ 1: గోషామహల్ పోలీస్ స్టేడియంలో ఉస్మానియా దవాఖాన నిర్మాణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వినోద్‌యాదవ్, కోటి శైలేశ్ కురుమ, పశుపతి, వీరేందర్, కిరణ్, వాసుయాదవ్ గోషామహల్ ప్రాంతంలో ఇం టింటికీ తిరిగి సంతకాలు సేకరించారు. దవాఖాన ఏర్పాటు నిర్ణయాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకునేంత వరకు ఆందోళన చేపడ్తామని వారు హెచ్చరించారు. దవాఖాన మార్చురీతో దుర్గంధం వ్యాప్తి చెంది ఇక్కడి ప్రజలు అనారోగ్యం పాలయ్యే ప్రమాదముందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రత్యామ్నాయ స్థలం ఎంపికచేసి నిర్మాణ పనులు చేపట్టాలని కోరారు.