వరంగల్, ఏప్రిల్ 4(నమస్తే తెలంగాణ ప్రతినిధి): ‘తెలంగాణలో నందమూరి తారక రామారావుకు అభిమానులు ఉన్నారు. నారా చంద్రబాబు నాయుడుకు సహచరులు, అనుచరులు ఉన్నారు. వాళ్లందరికీ నా విజ్ఞప్తి ఒక్కటే.. ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఉండొద్దని కక్షగట్టి, పార్టీ నాయకత్వాన్ని దెబ్బతీసిన చంద్రశేఖర్‌రావును, బీఆర్ఎస్ను సమూలంగా వంద మీటర్ల గోతి తీసి పాతిపెట్టాలి. ఊర్లల్లో బీఆర్ఎస్ దిమ్మెలు కూలాలి. బీఆర్ఎస్ను బొందపెట్టాల్సిన బాధ్యత మనందరిమీదా ఉన్నది. అప్పుడే నందమూరి తారక రామారావుకు నిజమైన నివాళి’.. రెండు నెలల కిందట ఖమ్మం సభలో సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇవి. ‘ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా?’ అన్నట్టు నాయకుడే ‘విధ్వంస’ భాష మాట్లాడితే, కార్యకర్తలు చూస్తూ ఊరుకుంటారా? రెచ్చిపోయి ప్రతిపక్షంపై, ప్రశ్నించేవారిపై దాడులకు దిగడం సహజం. అధికార కాంగ్రెస్ పార్టీ బరితెగింపు కారణంగా ప్రస్తుతం రాష్ట్రంలో ‘భౌతిక దాడుల’ విష సంస్కృతి రాజ్యమేలుతున్నది. ‘చేయి’ అందుకుంటే చెట్టాపట్టాలు.. కాదంటే ఖతమైపోతారు అన్నట్టు రాష్ట్రంలో పాలన సాగుతున్నదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఏకంగా ప్రతిపక్షాన్నే లేకుండా చేస్తే తమకు ఎదురంటూ ఉండదని అధికారపక్షం భావిస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. గజ్వేల్‌లోని మాజీ సీఎం కేసీఆర్ కార్యాలయంపై కాంగ్రెస్ కార్యర్తల దాడే ఇందుకు ప్రత్యక్ష నిదర్శనమని చెప్తున్నారు.
ఆద్యుడు రేవంత్‌రెడ్డే
తెలంగాణలో మొదటినుంచీ ప్రతిపక్షాల మీద భౌతికదాడులకు పాల్పడే సంస్కృతి లేదు. పదేండ్ల కేసీఆర్ పాలనలో అధికార, ప్రతిపక్షాలు విధానపరమైన, సైద్ధాంతికపరమైన అంశాలపై ‘నువ్వానేనా’ అన్నట్టు తలపడ్డాయే తప్ప ఏనాడూ హద్దు దాటలేదు. ప్రతిపక్ష పార్టీల కార్యాలయాలు, నాయకులే లక్ష్యంగా దాడులకు పాల్పడిన ఘటనలు ఎన్నడూ లేవని బీఆర్ఎస్తో విభేదించేవారు సైతం చెప్తున్నారు. కానీ శనివారం గజ్వేల్‌లోని బీఆర్ఎస్ పార్టీ అధినేత, తెలంగాణ ఉద్యమనాయకుడు, రాష్ర్టానికి తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కార్యాలయంపై కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు దాడి చేయడాన్ని తెలంగాణ సమాజం జీర్ణించుకోలేకపోతున్నది. తెలంగాణలో మునుపెన్నడూ లేని విష సంస్కృతి రాజ్యమేలుతున్నదని, దీనికి ఆద్యుడు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డేననే ఆరోపణలు సర్వత్రా వినిపిస్తున్నాయి. రాజకీయసభలు, అధికారిక సభలే కాకుండా చివరికి శాసనసభలోనూ సీఎం రేవంత్‌రెడ్డి చేస్తున్న విషపూరిత వ్యాఖ్యలు ఆ పార్టీ శ్రేణులను దాడులకు పురికొల్పుతున్నాయని స్పష్టం చేస్తున్నారు.
బుసకొట్టిన ‘విష’ఘటనలెన్నో
సీఎం రెచ్చగొట్టే వ్యాఖ్యలతో ఊగిపోయిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు భౌతికదాడులకు దిగుతున్నారు. దాదాపు రెండున్నరేండ్ల కిందట కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది మొదలు గజ్వేల్ ఘటన వరకు జరిగిన దాడులన్నీ రేవంత్ నాటిన విష సంస్కృతికి చిహ్నాలనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో సిద్దిపేటలో బీఆర్ఎస్ ఎల్పీ ఉపనేత, మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అధికారిక నివాసంపై కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారని గుర్తుచేస్తున్నారు. తుమ్మిళ్ల లిఫ్ట్ మోటర్‌ను ఆలంపూర్ ఎమ్మెల్యే విజయుడు ఆన్ చేసిన కొద్దిసేపటికే మాజీ ఎమ్మెల్యే సంపత్‌కుమార్ మోటార్ స్విచ్‌ను ఆఫ్ చేసి వాగ్వాదానికి దిగిన ఘటనలో పోలీసులు బీఆర్ఎస్ ఎమ్మెల్యే విజయుడిని అరెస్టు చేయడం కూడా ఒక ఉదాహరణగా చెబుతున్నారు. తాను పార్టీ మారలేదని శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ చేసిన బుకాయింపు మాటలు నిజమే అయితే ‘ఇద్దరం కలిసి తెలంగాణ భవన్‌కు పోదాం పద’ అని ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి సవాల్ చేయగా, రౌడీలు, పోలీసుల అండతో కౌశిక్‌రెడ్డి ఇంటిపై దౌర్జన్యానికి దిగిన ఘటనను బీఆర్ఎస్ గుర్తుచేస్తున్నది. నిరుద్యోగ యువకుల కోసం దీక్ష చేస్తున్న మోతీలాల్ అనే విద్యార్థి నాయకుడిని పరామర్శించినా తట్టుకోలేనితనంతో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి, పార్టీ విద్యార్థి విభాగం నాయకుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్, పార్టీ సీనియర్ నాయకులు రాకేశ్‌రెడ్డి సహా పలువురు ప్రజాప్రతినిధులను కాంగ్రెస్ ప్రభుత్వం పోలీసులను ఉసిగొల్పి అదుపులోకి తీసుకున్నదని చెప్తున్నారు.
ప్రశ్నించే గొంతులే లక్ష్యంగా..
గతంలో సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ మండలం సింగార్బొగుడ తండాకు చెందిన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త శ్రీనునాయక్ తన గ్రామంలో వేసిన సీసీ రోడ్డు పనుల విషయంలో ప్రశ్నించినందుకు పంచాయితీ పేరుతో పిలిచి కాంగ్రెస్ కార్యకర్తలు విచక్షణారహితంగా దాడి చేయగా ఆయన మరణించారని చెప్తున్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపుతూ సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారనే అక్కసుతో ధర్మపురి నియోజకవర్గ సోషల్ మీడియా కో-ఆర్డినేటర్ సల్వాజీ మాధవరావుపై కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు విచక్షణారహితంగా దాడి చేసి గాయపరిచారని పేర్కొన్నారు. ఇలా ప్రశ్నించే గొంతులను నులిమేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం అడుగులు వేస్తున్నదనే ఆరోపణలున్నాయి.
ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలను బహిరంగ సభల్లోనో, అధికారిక కార్యక్రమాల్లోనో నిలదీసిన ప్రజలను సైతం వదిలిపెట్టకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరించిన ఉదంతాలు అనేకం ఉన్నాయి. సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వాన్ని ప్రశ్నించారనే అక్కసుతో రాష్ట్రంలోని దాదాపు అన్ని నియోజకవర్గాల్లోని తమ పార్టీ సానుభూతిపరులను కేసులు పెట్టి భయబ్రాంతులకు గురిచేస్తున్నారని, భౌతికదాడులకు పాల్పడుతున్నారని బీఆర్ఎస్ ఆరోపిస్తున్నది. పార్టీతో సంబంధం లేని సాధారణ ప్రజాస్వామికవాదులను సైతం సోషల్‌మీడియాలో పోస్టులు పెట్టారనే నెపంతో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అనేకరకాలుగా భయబ్రాంతులకు గురిచేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఓదార్పును ఓర్చుకోనితనం
ప్రజలు ఆపదలో ఉన్నప్పుడు రాజకీయాలకు అతీతంగా స్పందించటం కనీస ధర్మం. దురదృష్టవశాత్తు రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆ అవగాహన అయినా లేకుండాపోయిందనే విమర్శలున్నాయి. గతంలో ఖమ్మం జిల్లాను భారీ వర్షాలు అతలాకుతలం చేసింది. వరదల్లో చిక్కుకొని బిక్కుబిక్కుమంటున్న ఖమ్మం పట్టణవాసులను ఆదుకోవటానికి మాజీ మంత్రి హరీశ్‌రావు సారథ్యంలో మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, జగదీశ్‌రెడ్డి, పువ్వాడ అజయ్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, ఎమ్మెల్యేలు కేపీ వివేకాంద, పాడి కౌశిక్‌రెడ్డి తదితరులు అక్కడికి వెళ్లారు. వరద ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టాల్సిన ప్రభుత్వం స్పందించకపోగా, ఆపన్నహస్తం అందించేందుకు వెళ్లిన బీఆర్ఎస్ బృందంపై కాంగ్రెస్ కార్యకర్తలు విచక్షణారహితంగా దాడులకు పాల్పడిన సంగతి తెలిసిందే. ఆ దాడిలో పలు వాహనాలు ధ్వంసం అయ్యాయి. ఆ ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్రంగా చర్చనీయాంశమైంది. ప్రజలు వరదల్లో చిక్కుకుంటే అధికార పార్టీ రాజకీయాలు చేయడం దుర్మార్గమైన చర్యగా ఆగ్రహం వ్యక్తం చేశారు.
డైవర్షన్ పాలిటిక్స్‌లో భాగమా?
రెండున్నర సంవత్సరాలుగా కాంగ్రెస్ ప్రభు త్వం డైవర్షన్ పాలిటిక్స్‌కు కేరాఫ్‌గా మారిందనే విమర్శలు ఉన్నాయి. తాజాగా గజ్వేల్‌లో కేసీఆర్ క్యాంపు కార్యాలయంపై కాంగ్రెస్ శ్రేణుల దాడి కూడా అందులో భాగమనే వాదనలు వినిపిస్తున్నాయి. రెండు నెలల కిందట మున్సిపల్ చైర్మన్ల ఎన్నిక సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమాలకు పాల్పడి అనేక చోట్ల మున్సిపల్ పీఠాలను కైవసం చేసుకుందని బీఆర్ఎస్ విమర్శించింది. సరైన సంఖ్యాబలం లేకపోయినా పోలీసులను ఉసిగొల్పి అక్రమ కేసులను బనాయిస్తామని బెదిరించి, డబ్బు మూటలను ఎరగా వేసి మున్సిపల్ పీఠాలను సొంతం చేసుకున్నదనే ఆరోపణలు ఉన్నాయి. అయితే ప్రభు త్వ తాయిలాలకు, బెదిరింపులకు లొంగకుండా క్యాతన్‌పల్లి, ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ కౌన్సిలర్లు ప్రజల పక్షాన నిలబడిన సంగతి తెలిసిందే. నాడు వాయిదా పడిన ఆ 2 మున్సిపల్ చైర్మన్ల ఎన్నిక శనివారం జరిగింది. రెండు చోట్లా బీఆర్ఎస్ జయకేతనం ఎగురవేసింది. దీన్ని జీర్ణించుకోలేని కాంగ్రెస్ పెద్దలే కేసీఆర్ క్యాంపు ఆఫీస్‌పై దాడికి తమపార్టీ కేడర్‌ను ఉసిగొల్పా రని, బీఆర్ఎస్ విజయం నుంచి దృష్టిని మళ్లించేందుకు ప్రయత్నించారని విమర్శిస్తున్నారు.