హైదరాబాద్, మే 14 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికల పోలింగ్ 65.67 శాతంగా నమోదైంది. మొత్తం 3,32,32,318 మంది ఓటర్లకు 2,20,24,806 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. 2019లో 62.77శాతం నమోదుకాగా ఈసారి 2.90 శాతం ఓటింగ్ పెరిగింది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో పోలింగ్ శాతం గతం కంటే అధికంగా నమోదైంది. ఆంధ్రప్రదేశ్, ఇతర రాష్ర్టాల వారు స్వస్థలాలకు వెళ్లినా ఇక్కడివారు ఓటేసేందుకు ఉత్సాహంగా ముందుకు రావడంతో జీహెచ్ఎంసీ పరిధిలో గతం కంటే ఎక్కువగానే ఓటింగ్ జరిగింది. లోక్‌సభ నియోజకవర్గాలవారీగా చూస్తే 76.68 శాతంతో భువనగిరి మొదటి, 76.09 శాతంతో ఖమ్మం రెండో స్థానంలో నిలిచాయి. ఇక అతి తక్కువగా హైదరాబాద్‌లో 48.48 శాతం మాత్రమే నమోదైంది. ఓట్ల పరంగా రాష్ట్రంలోనే అత్యధికంగా మల్కాజ్‌గిరిలో 19.19 లక్షల ఓట్లు, చేవెళ్లలో 16.57 లక్షల ఓట్లు పోలయ్యాయి. అతి తక్కువగా సికింద్రాబాద్‌లో 10.39 లక్షల ఓట్లే పడ్డాయి. రాష్ట్రవ్యాప్తంగా 2,18,14,035 మంది ఓటర్లు ఈవీఎంల ద్వారా, 1,89,091 మంది ఉద్యోగులు వారికి కేటాయించిన పోలింగ్ కేంద్రాలు, పోస్టల్ బ్యాలెట్ ద్వారా, 21,680 మంది హోం ఓటింగ్ ద్వారా ఓటు హక్కును వినియోగించుకున్నారు. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా మెదక్ లోక్‌సభ పరిధిలోని నర్సాపూర్‌లో అత్యధికంగా 84.25 శాతం, హైదరాబాద్ పరిధిలోని మలక్‌పేటలో అత్యల్పంగా 42.76 శాతం ఓట్లు పోలయ్యాయి. ఓటర్ల పరంగా మేడ్చల్ నియోజకవర్గంలో అత్యధికంగా 3,85,149 మంది, భద్రాచలంలో అత్యల్పంగా 1,05,383 మంది ఓటేశారు.
పెరిగిన ఓటింగ్.. బీఆర్ఎస్కు అనుకూలమనే చర్చ..
2019 ఎన్నికల కంటే ఈసారి ఓటింగ్ శాతం గణనీయంగా పెరిగింది. అత్యధికంగా గ్రామీణ ప్రాంతాలు ఉండే నాగర్‌కర్నూలు, పెద్దపల్లి, ఖమ్మం, మహబూబాబాద్, మహబూబ్‌నగర్, మెదక్, జహీరాబాద్ లాంటి నియోజకవర్గాల్లో పోలింగ్ భారీగా నమోదైంది. గ్రామీణ ప్రాంతాల్లో ఓటర్లు ఉదయం నుంచే ఉత్సాహంగా పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారు. క్యూలో గంటల తరబడి బారులు తీరి ఓటేశారు. గ్రామీణ ప్రాంతాల్లో ఓటింగ్ శాతం పెరగడం బీఆర్ఎస్కు అనుకూలమనే సంకేతాలు ఇస్తున్నదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలు అమలు చేయకుండా మభ్యపెట్టడం, కరెంటు కోతలు పెరిగిపోవటం, సాగునీరందక పంటలు ఎండిపోవటం, సమయానికి పెట్టుబడి సాయం అందకపోవటం, రూ.2లక్షల రుణమాఫీ కాకపోవటం, ధాన్యం కొనుగోళ్లలో జాప్యం, తాగునీటి కటకట, విద్యుత్ బిల్లులు కొందరికే మాఫీ అవటం, 500 గ్యాస్ పథకం అమలు కాకపోవటం తదితర కారణాలపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న ప్రజలు, బీఆర్ఎస్ వైపే మొగ్గుచూపినట్లు విశ్లేషిస్తున్నారు. కేసీఆర్ బస్సు యాత్ర సందర్భంగా రైతులు, మహిళలు, యువత నుంచి విశేష స్పందన వచ్చిందని, నమ్మి కాంగ్రెస్‌కు అధికారమిస్తే జరిగిన నష్టం వారికి తెలిసి వచ్చిందని, అందుకే ఈ సారి బీఆర్ఎస్ వైపే మొగ్గుచూపారనే అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఓటింగ్ సైలెంట్‌గా జరిగిందని, నిశ్శబ్ద విప్లవం రాబోతున్నదని చెబుతున్నారు.
‘గులాబీ’కే పట్టణవాసుల పట్టం
ఈ సారి గ్రేటర్ హైదరాబాద్‌లోని సికింద్రాబాద్, హైదరాబాద్, మల్కాజ్గిరి, చేవెళ్ల లోక్‌సభ నియోజకవర్గాల్లోనూ ఓటింగ్ శాతం పెరిగింది. ఇక్కడ స్థిరపడ్డ లక్షలాది మంది తమ రాష్ర్టాలకు ఓటేసేందుకు తరలివెళ్లారు. ఈ క్రమంలో ఓటింగ్ శాతం తగ్గుతుందేమోనని అంతా ఆందోళన చెందినా అందుకు విరుద్ధంగా పోలింగ్ శాతం పెరిగింది. జీహెచ్ఎంసీ పరిధిలో బీఆర్ఎస్కు మద్దతుగానే పోలింగ్ శాతం పెరిగిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఐటీ ఉద్యోగులు ఓటు హక్కును వినియోగించుకోరనే అపవాదును తొలగించుకునేందుకు ఉదయం నుంచే బారులు తీరారు. వాతావరణం అనుకూలించడంతో ప్రశాంతంగా ఓటు హక్కును వినియోగించుకున్నారు. హైదరాబాద్, ఐటీ అభివృద్ధి బీఆర్ఎస్తోనే సాధ్యమైందని, బీఆర్ఎస్తోనే హైదరాబాద్ భవిష్యత్తు అన్న ఉద్దేశంతోనే ఆ పార్టీవైపు మొగ్గు చూపారని విశ్లేషిస్తున్నారు.

