హైదరాబాద్, డిసెంబర్ 26 (నమస్తే తెలంగాణ): తుంగభద్ర డ్యామ్ గేట్ల మార్పు పనులు ప్రారంభమయ్యాయి. తుంగభద్ర బోర్డు (టీబీ) అధికారుల నేతృత్వంలో ఈ పనులు కొనసాగుతున్నట్టు రాష్ట్ర ఇరిగేషన్ శాఖ అధికారులు వెల్లడించారు. నిరుడు ఆగస్టులో వచ్చిన వరద ప్రవాహానికి తుంగభద్ర జలాశయం 18వ క్రస్ట్ గేట్ కొట్టుకుపోవడంతో తాత్కాలిక మరమ్మతులు చేశారు. అనంతరం మొత్తంగా డ్యామ్ ఇతర క్రస్ట్ గేట్ల పనితీరును అంచనా వేసేందుకు కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) ప్రత్యేకంగా ఏకే బజాజ్ నేతృత్వంలో సాంకేతిక నిపుణుల కమిటీని నియమించింది. ఆ బృందం డ్యామ్‌ను క్షుణ్ణంగా తనిఖీచేసి మొత్తం 33 క్రస్ట్ గేట్లను మార్చాలని సిఫారసు చేసింది.
దీంతో గేట్ల మార్పునకు తుంగభద్ర బోర్డు సంపూర్ణ ప్రణాళికను నిర్ణయించింది. 2026 జూన్ చివరి నాటికి మొత్తం గేట్ల మార్పు ప్రక్రియను పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నది. నెలకు 8 గేట్లను అమర్చేలా ప్రణాళికలను సిద్ధం చేసింది. దీంతో గేట్ల మార్పు పనులు ప్రారంభమయ్యాయి. అధికారులు తొలుత 18వ క్రస్ట్ గేట్ ఏర్పాటును చేపట్టారు. 18, 20, 24వ గేట్లకు సంబంధించిన ప్లేట్లను ఇప్పటికే తొలగించారు. 4, 11, 27, 28 ప్లేట్ల తొలగింపు ప్రక్రియను చేపట్టారు. ప్రస్తుత తుంగభద్ర డ్యామ్‌లో 54 టీఎంసీల నీరు ఉన్నది. ఇది 40 టీఎంసీలకు తగ్గగానే పూర్తిస్థాయి పనులు చేపట్టేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.