హైదరాబాద్, మే 26 (నమస్తే తెలంగాణ) : ‘ఆది ధ్వని’ సంస్థతో ఉస్మానియా యూనివర్సిటీ చేసుకున్న భూముల లీజు ఒప్పందాన్ని వెంటనే రద్దు చేయాలని బీఆర్ఎస్వీ రాష్ట్ర నాయకుడు తుంగ బాలు డిమాండ్ చేశారు. ఆర్టీసీ హాస్పిటల్ ఎదురుగా ఉన్న ప్రొఫెసర్ క్వార్టర్స్‌ని ‘ఆది ధ్వని’ సంస్థకి 30 సంవత్సరాలపాటు లీజుకు ఇవ్వాలని యూనివర్సిటీ అధికారులు ఒప్పందం చేసుకోవడం సిగ్గుచేటని మండిపడ్డారు. జస్టిస్ చిన్నప్పరెడ్డి కమిషన్‌కి విరుద్ధంగా ప్రైవేటు వ్యక్తులకు భూమిని కేటాయించడం దారుణమని పేర్కొన్నారు.
రేవంత్ సర్కార్ తీరు అయితే హెచ్‌సీయూ భూములు, లేకుంటే ఓయూ భూములు అన్నట్టు ఉన్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. రియల్ ఎస్టేట్ నుంచి వచ్చానని చెప్పుకునే రేవంత్ రెడ్డి ప్రభుత్వ భూములను సిగ్గు లేకుండా అమ్మడం, లీజులకు ఇవ్వడంతో రాష్ట్ర పరువు పోతున్నదని మండిపడ్డారు. ఇప్పటికే ఓయూ భూములు 2,400 ఎకరాల నుంచి 1,300 ఎకరాలకు తగ్గిపోయాయని ఆవేదన వ్యక్తంచేశారు. వర్సిటీ భూములను లీజు పేరుతో ప్రైవేటు వ్యక్తులకు కట్టబడితే బీఆర్ఎస్వీ తరఫున తగిన గుణపాఠం చెబుతామని తుంగ బాలు హెచ్చరించారు.