హైదరాబాద్, ఆగస్టు 21(నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో యూరియా కోసం క్యూలైన్లలో నిల్చున్నవారెవరూ రైతులు కాదని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. నిజంగా యూరియా అవసరమున్న వాళ్లంతా తీసుకుని వెళ్తున్నారని చెప్పారు. రైతులు చేస్తున్న ఆందోళనలన్నీ రాజకీయ ప్రేరేపితమని ఆరోపించారు. దేశవ్యాప్తంగా యూరియా కొరత ఉందని, కానీ ఒక్క తెలంగాణలోనే ఉన్నట్టు కొందరు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
ఈ మేరకు గురువారం మంత్రి మాట్లాడుతూ రాష్ర్టానికి అవసరమైన యూరియా సరఫరా చేయడంలో కేంద్రం విఫలమైందని తెలిపారు. కానీ దీన్ని కప్పిపుచ్చుకునేలా కేంద్ర మంత్రులు వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. చైనా నుంచి దిగుమతి కావల్సిన యూరి యా తెప్పించడంలో కేం ద్ర ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. రైతులకు యూరియా స్టాక్ ఎప్పుడు వస్తుందో తెలిసేలా ముందస్తు ప్రణాళికలు తయారు చేసుకోవాలని జిల్లా వ్యవసాయశాఖ అధికారులకు తుమ్మల సూచించారు.
అలాగే ప్రైవేటు డీలర్ల వద్ద ఉన్న యూరియా నిల్వలను కూడా రైతులకు అమ్మే విధంగా చూడాలని, క్యూలైన్ లేకుండా చూడాలని సూచించారు. ఎవరైనా ప్రైవేటు డీలర్లు ఎకువ ధరకు అమ్మినట్టయితే కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. యూరియా అమ్మకాలలో పాస్బుక్ అనుసంధానం చేసే అవకాశాలను పరిశీలించాలని అధికారులకు సూచించారు. నానో యూరియాపై అవగాహన పెంచాలన్నారు.