హైదరాబాద్: యూరియా విషయంలో శవాలపై పేలాలు ఏరుకునేలా బీజేపీ వ్యవహారం ఉన్నదని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు (Tummala Nageswara Rao) ఆగ్రహం వ్యక్తం చేశారు. యూరియా సరఫరాపై బీజేపీ అసత్య ప్రచారం మానుకోవాలన్నారు. ఆ పార్టీ అధ్యక్షుడు రాంచందర్‌రావుకు పలుకుబడి ఉంటే కేంద్రం నుంచి యూరియా తెప్పించాలని డిమాండ్ చేశారు. అయితే ఆయనకు అంత పలుకుబడి ఉందని తాను అనుకోవడం లేదని చెప్పారు. దేశవ్యాప్తంగా యూరియా సమస్య ఉన్నదని తెలిపారు. అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో భారతదేశం యూరియాను దిగుమతి చేసుకోలేకపోతున్నదని వెల్లడించారు. యూరియాను దాచుకుని తాము ఏం చేసుకుంటామని ప్రశ్నించారు. పదేపదే రాంచందర్ రావు విమర్శలు సరికాదన్నారు. బాధ్యత గల పదవిలో ఉన్నప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలని సూచించారు. యూరియాపై కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్ రెడ్డితో వ్యక్తిగతంగా మాట్లాడాలన్నారు. కేంద్రాన్ని ఒప్పించి రాంచందర్‌రావు యూరియా తెప్పించాలని కోరారు.
యూరియా విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తరపున చేయాల్సిందంతా చేస్తున్నామన్నారు. కేంద్రం కూడా సహకరించాలని కోరారు. రాష్ట్రానికి ఆగస్టు వాటా యూరియా ఇవ్వాలని చెప్పారు. అత్యవసరాన్ని గుర్తించి యూరియాను త్వరగా ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. యూరియాను కనీసం చూడని నేతలు కూడా విమర్శలు చేస్తున్నారని విమర్శించారు. పెద్దపెద్ద మాటలు మాట్లాడి అభాసుపాలుకావొద్దని సూచించారు. తనను విమర్శించే వారు కేంద్రమంత్రి నడ్డాను అడగవచ్చని చెప్పారు. యూరియా సరఫరాపై అన్ని లెక్కలు ఇస్తున్నానని వెల్లడించారు. రాంచందర్‌రావు అంటే తనకు గౌరవం ఉందని, అబద్ధాలు చెప్పి బీజేపీని బాగుచేయాలంటే సాధ్యం కాదన్నారు. రైతులపై రాజకీయాలు చేసి పార్టీని పెంచుకోలేరని వెల్లడించారు. రాంచందర్‌రావు వాస్తవాలు ఒప్పుకోవాలని హితవుపలికారు.