Minister Tummala | ఖమ్మం, ఆగస్టు 21 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఇప్పటివరకు 22 లక్షల మంది రైతులకు పంట రుణాలను మాఫీ చేశామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టంచేశారు. ప్రభుత్వం వద్ద 41,78,892 మంది రైతుల డాటా ఉన్నదని వెల్లడించారు. ఆయా రైతులు సుమారు 40 బ్యాంకులకు చెందిన 5,782 బ్రాంచీల్లో రూ.31 వేల కోట్ల పంట రుణాలు తీసుకున్నట్టు గుర్తించామని తెలిపారు. ఇందులో ఆగస్టు 15 నాటికి రూ.18 వేల కోట్లను రైతుల ఖాతాల్లో జమచేశామని వివరించారు.
వీరంతా రూ.2 లక్షలలోపు రుణాలు ఉన్నవారేనని పేర్కొన్నారు. బుధవారం ఆయన ఖమ్మంలోని తన క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. బ్యాంకుల తప్పిదాలు, సాంకేతిక కారణాల వల్లనే రుణమాఫీలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పారు. అందరికీ రుణమాఫీ అయ్యే దాకా ఈ ప్రక్రియ కొనసాగుతుందని చెప్పారు. ముందుగా రూ.2 లక్షలలోపు రుణాలు ఉన్నవారికి మాఫీ చేస్తామని తెలిపారు.
రూ.2 లక్షలకుపైన రుణం తీసుకున్న వారి విషయంలో ఏమి చేయాలనే అంశంపై క్యాబినెట్లో మరోసారి చర్చించి నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. రాష్ట్ర ఆదాయాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ రుణాలను కూడా దశలవారీగా మాఫీ చేస్తామని తెలిపారు. అయితే, రూ.2 లక్షలపైన రుణం ఉన్నవారు ఆపై మొత్తం కట్టాల్సి ఉంటుందని, ఆ తరువాతే వారికి మాఫీ పూర్తవుతుందని స్పష్టంచేశారు. తెల్లరేషన్ కార్డు లేకపోయినా అర్హులైన ప్రతి ఒక్కరికీ రుణమాఫీ చేస్తామని స్పష్టంచేశారు. అర్హులైన రైతులెవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.
రుణమాఫీలో ఏ ఒక్క రైతుకూ అన్యాయం జరగకుండా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తుమ్మల తెలిపారు. ఆధార్ నంబర్లో తప్పులు, బ్యాంకు ఖాతాలో తప్పులు సహా ఇతరత్రా ఏమైనా కారణాల వల్ల రుణం మాఫీ కాకపోతే అలాంటి రైతుల కోసం మండల కేంద్రాల్లో వ్యవసాయ శాఖ అధికారి, గ్రామాల్లో వీవోఏలు, బ్యాంకుల వద్ద అధికారులను ప్రత్యేకంగా నియమించినట్టు తెలిపారు. రైతులకు ఎలాంటి సమస్యలు ఉన్నా అధికారులకు దరఖాస్తు అందజేయాలని సూచించారు. అధికారులు ఇంటింటికీ వెళ్లి వివరాలు సేకరిస్తారని, కుటుంబాలను నిర్దారించిన తరువాత ఆయా ఖాతాలకు రుణమాఫీ డబ్బులు చెల్లిస్తామని తెలిపారు.
2018 డిసెంబర్ 12 నుంచి 2023 డిసెంబర్ 9 వరకు తీసుకున్న రుణాలనే మాఫీ చేస్తున్నామని తుమ్మల స్పష్టం చేశారు. ఎన్నికల హామీ ఇచ్చిన నాటి నుంచి రుణాలు మాఫీ చేద్దామనే చర్చ క్యాబినెట్లో జరిగినప్పటికీ, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మాత్రం గత ఐదేండ్లలో రైతులు తీసుకున్న రుణం మొత్తం మాఫీ చేయాలని నిర్ణయించారని చెప్పారు.