హైదరాబాద్, జూన్ 17(నమస్తే తెలంగాణ) : ప్రభుత్వం ప్రోత్సహిస్తున్న ఏడు వరి రకాలకే బోనస్ వర్తించనున్నదని, రైతులు ఆ రకాలను మాత్రమే సాగు చేయాలని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు స్పష్టంచేశారు. ఈ మేరకు బుధవారం వానకాలం సాగు సన్నద్ధత, ఎరువులు, విత్తనాల అందుబాటుపై సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. మార్కెట్లో డిమాండ్ ఉన్న సన్నాలను మాత్రమే సాగు చేయాలని రైతులకు సూచించారు.
మారెట్ డిమాండ్, మిల్లర్ల సూచనలు, ఎగుమతి అవకాశాలను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం బీపీటీ-5204(సాంబమసూరి), ఆర్ఎన్ఆర్-15048 (తెలంగాణ సోనా), హెచ్ఎంటీ సోనా, జైశ్రీరామ్, కేఎన్ఎం-1638 (కూనారం సన్నాలు), డబ్ల్యూజీఎల్-44 (సిద్ధి), కేఎన్ఎం-7715 రకాల సాగును ప్రోత్సహిస్తున్నట్టు తెలిపారు. ఈ నేపథ్యంలో ఈ ఏడు రకాల విత్తనాలను రైతులకు అందుబాటులో ఉంచాలని కంపెనీలకు సూచించారు. ఇక విత్తన సబ్సిడీపై ప్రభుత్వం త్వరలో నిర్ణయం తీసుకుంటుందని, సబ్సిడీ మొత్తాన్ని రైతుల ఖాతాల్లో జమచేసే విధానాన్ని పరిశీలిస్తున్నట్టు తెలిపారు.