హైదరాబాద్, ఏప్రిల్ 6(నమస్తే తెలంగాణ) : రసాయన ఎరువుల వినియోగం తగ్గించేందుకు రైతులకు అవగాహన కల్పిస్తామని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు తెలిపారు. ఇందుకోసం 30వేల మంది సాయిల్ హెల్త్ వలంటీర్లను నియమించబోతున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు తొలిదశలో కొడంగల్ నియోజకవర్గం నుంచి ఎంపికైన 120 మంది సాయిల్ హెల్త్ వలంటీర్లకు ఇక్రిసాట్ ప్రధాన కార్యాలయంలో రెండ్రోజులపాటు జరుగనున్న శిక్షణను మంత్రి తుమ్మల సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. నేల ఆరోగ్యం కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందని పేర్కొన్నారు. సాగులో రసాయన ఎరువులను తగ్గించాలని, దీనిపై రైతులకు అవగాహన కల్పించాలని ఆదేశించారు. ఈ శిక్షణను సద్వినియోగం చేసుకొని సేంద్రియ, శాస్త్రీయ మట్టి నిర్వహణ పద్ధతులు అవలంబించాలని సూచించారు. పిల్లి పెసర, జీలుగ, జనుము, మినుము, పెసర లాంటి లెగ్యూమీనస్ పంటలు వేసుకొని నేల సారాన్ని పెంచుకోవాల్సిన అవసరం ఉందని మంత్రి తుమ్మల తెలిపారు.
హైదరాబాద్, ఏప్రిల్ 6(నమస్తే తెలంగాణ): ఆదాయాన్ని సమకూర్చే శాఖల్లో అక్రమాలు, నిధులు పక్కదారి పట్టడాన్ని అరికట్టేందుకు ఆ శాఖల మధ్య సమగ్రమైన డాటా షేరింగ్ కోసం ‘రెవ్వన్’ ఏకీకృత రెవెన్యూ పోర్టల్ ఏర్పాటుచేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన విధివిధానాలు రూపొందించేందుకు సీఎస్ కే రామకృష్ణారావు నేతృత్వంలో స్టీరింగ్ కమిటీని ఏర్పాటుచేస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. అదేవిధంగా అదనపు ఆదాయ వనరులను సమకూర్చడంతోపాటు స్థానిక సంస్థల ద్వారా వినోదపు పన్ను విధించే అంశంపై సాధ్యాసాధ్యాలను పరిశీలించే బాధ్యతను కూడా ఈ కమిటీకి అప్పగించింది.