హుస్నాబాద్ టౌన్, జూన్ 6: రైతుభరోసా పథకం అమలులో గతంలో రెండుసార్లు తప్పు జరిగిన మాట వాస్తవమేనని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు అంగీకరించారు. ఇదే విషయాన్ని ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశంలో ముఖ్యమంత్రికి వివరించానని తెలిపారు. ఈ సారి విత్తనాలు పెట్టేలోపే రైతుభరోసా నిధులను రైతుల ఖాతాల్లో జమ చేస్తామని హామీ ఇచ్చారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డులో మూడురోజులపాటు జరిగే రైతు మహోత్సవాన్ని శుక్రవారం మంత్రి పొన్నం ప్రభాకర్తో కలిసి తుమ్మల ప్రారంభించారు. అనంతరం మంత్రి ఆయన మాట్లాడుతూ ఎరువులు సకాలంలో అందక రైతులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు.
రాష్ర్టానికి సరిపడా ఎరువులను కేంద్రం ఇవ్వడంలేదని, ఈనెల 9న కేంద్రమంత్రి వద్దకు వెళ్లనున్నట్టు తెలిపారు. మంత్రి పొన్నం మాట్లాడుతూ కాలానికి అనుగుణంగా రైతులు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని పంటలను సాగుచేసి అదనపు ఆదాయాన్ని పెంచుకోవాలని సూచించారు. సమావేశంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ అంజిరెడ్డి, కలెక్టర్ మనుచౌదరి, కార్పొరేషన్ చైర్మన్లు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రైతు మహోత్సవాన్ని పురస్కరించుకుని హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డు ఆవరణలో 134 స్టాళ్లను ఏర్పాటుచేశారు. ఎరువులు, విత్తనాలు, యంత్రాలు, తదితర విభాగాలకు చెందిన స్టాళ్లను వరంగల్, కరీంనగర్, మెదక్ తదితర జిల్లాల నుంచి వచ్చిన రైతులు తిలకించారు.