Thummala Nageshara Rao | వానకాలంలో యూరియా కొరతతో ఇబ్బందులు పడిన మాట వాస్తవమే. యాసంగికి చర్యలు తీసుకున్నం. డిసెంబర్లో 3 లక్షల టన్నులు అమ్మాల్సి ఉంటే 4 లక్షల టన్నులకు పైగా అమ్ముడైంది. ఏడాదికి యూరియా ఒకేసారి కొనడం వల్లే సమస్య.
హైదరాబాద్, జనవరి 6 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో గత వానకాలంలో యూరియా కొరతతో రైతులు ఇబ్బందులు పడిన మాట వాస్తవమేనని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అసెంబ్లీలో అంగీకరించారు. మంగళవారం శాసనసభలో యూరియా, ఇతర ఎరువుల కొరతపై చర్చ సందర్భంగా మంత్రి మాట్లాడారు. జియో, పొలిటికల్ కారణాలతో కేంద్ర ప్రభుత్వం సరైన సమయంలో రాష్ర్టానికి యూరియా సరఫరా చేయలేదని తెలిపారు. డిసెంబర్లో 3 లక్షల టన్నులు అమ్మకాలు జరుగాల్సి ఉండగా.. 4లక్షల టన్నులకు పైగా అమ్మకాలైనట్టు వివరించారు. రైతులు ఏడాదికి సరిపోయే యూరియాను ఒకేసారి కొని పెట్టుకుంటున్నారని తెలిపారు. వచ్చే ఏడాది నుంచి టెక్నాలజీని వినియోగించుకొని రైతులు ఎంత భూమిలో ఏయే పంటలు సాగు చేస్తున్నారో.. దానికి తగ్గట్టుగా యూ రియాను సరఫరా చేస్తామని చెప్పారు.
అంతకుముందు యూరియా సమస్య పై బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌బాబు పలు అంశాలను లేవనెత్తారు. యూరియా యాప్ విషయంలో రైతుల్లో చాలా సందేహాలు ఉన్నాయని తెలిపారు. ఈ సందర్భంగా ‘నమస్తే తెలంగాణ’ పత్రికను సభలోకి తీసుకొచ్చిన ఆయన ‘యాప్ పోయి.. కార్డు వచ్చె!’ అన్న ప్రత్యేక కథనాన్ని సభ లో చదివి వినిపించారు. యూరియా కొర త దాచేందుకు సర్కార్ డ్రామా ఆడుతున్నదని.. సిద్దిపేట జిల్లాలో పైలట్ ప్రాజెక్టును ప్రభుత్వం తీసుకురానున్నదన్న కథనాన్ని సభలో ప్రత్యేకంగా చదివి వినిపించారు. రైతులకు ఉన్న ఈ అనుమానాలను ప్రభుత్వం నివృత్తి చేయాలని డిమాండ్ చేశారు. ఈ అంశంపై మంత్రి తుమ్మల సమాధానాన్ని దాటవేయడం గమనార్హం.