Telangana | హైదరాబాద్, ఫిబ్రవరి 24 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర వ్యాప్తంగా యూరియా కొరత తీవ్రమైంది. వారం పది రోజులుగా రాష్ట్రంలో ఎక్కడ చూసినా షాపుల వద్ద పోలీసుల పహారా నడుమ రైతులు యూరియా కోసం పడిగాపులు కాస్తున్నారు. టోకెన్ ఉంటేతప్ప దొరకడం లేదు. క్యూలో చెప్పులు, పాస్ బుక్కులు, ఆధార్‌కార్డులు దర్శనమిస్తున్నాయి. ఒక్కమాటలో చెప్పాలంటే మళ్లీ పాతరోజులు వచ్చాయి. ఉమ్మడి రాష్ట్రంలో పడ్డ తిప్పలు మళ్లీ ఎదురవుతున్నాయి. రైతులు ఒక్క బస్తా కోసం గంటల తరబడి క్యూలో వేచి ఉండాల్సిన దుర్భర పరిస్థితి వచ్చింది. యూరియా కొరత తీర్చేందుకు తీసుకోవాల్సిన చర్యలపై వ్యవసాయ శాఖ చేతులెత్తేసింది. ఓ వైపు మార్క్‌ఫెడ్ వద్ద బఫర్ నిల్వలు అడుగంటాయి. మరోవైపు ప్రభుత్వం నిర్లక్ష్యంతో కేంద్రం నుంచి రావాల్సిన ఎరువుల కోటా రావడం లేదు. దీంతో రోజురోజుకూ రైతులకు యూరియా ఇబ్బందులు పెరిగిపోతున్నాయి.
కాంగ్రెస్ సర్కారులో నాడు, నేడు రైతులకు ఎరువుల తిప్పలు తప్పడం లేదు. నాడు పోలీస్ పహారాలో పోలీస్ స్టేషన్లలో ఎరువులను పెట్టి అమ్మిన సందర్భాలున్నాయి. రోజుల తరబడి క్యూలో పడిగాపులు కాస్తే ఒక్క బస్తా దొరకడమే గగనమయ్యే పరిస్థితులుండేవి. యూరియా కోసం రైతుల రాస్తారోకోలు, ధర్నాలు నిత్యకృత్యంగా ఉండేవి. పలు సందర్భాల్లో రైతులపై పోలీసుల లాఠీలు విరిగిన పరిస్థితులు కూడా ఉన్నాయి. బీఆర్ఎస్ హయాంలో రైతులకు ఎరువుల ఇబ్బందులు తప్పాయి. నాటి ప్రభుత్వ ముందు చూపుతో ఎప్పుడు అవసరమైనా నిల్వలు అందుబాటులో ఉండేవి. కానీ ఇప్పుడు పాత రోజులు మళ్లీ వచ్చాయి. యూరియా కోసం క్యూలో చెప్పులు, పాస్ బుక్కులు, ఆధార్ కార్డులు దర్శనమిస్తున్నాయి.. రైతుల ధర్నాలు కొనసాగుతున్నాయి. మహబూబాబాద్‌లో యూరియా పంపిణీ కోసం పోలీసులు టోకెన్లు జారీ చేశారు. జగిత్యాలలో రైతుల పాస్ పుస్తకాలను క్యూలో పెట్టారు. మార్క్‌ఫెడ్ ద్వారా సరఫరా అయ్యే ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల వద్ద రైతులకు నిరీక్షణ తప్పడం లేదు. రెండు, మూడు రోజులకోసారి ఒక్క లారీ వస్తే నిమిషాల్లోనే ఖాళీ అవుతున్నది. ముందున్న రైతులకు ఒక బస్తా రెండు బస్తాలు లభిస్తే వెనకాల రైతులకు ఒక్క బస్తా కూడా దొరకడం లేదు.
ఒక్క బస్తా యూరియా కోసం రైతులు తమ వ్యవసాయ పనులను వదిలేసి గంటల తరబడి షాపుల వద్ద క్యూలో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో వ్యవసాయ పనులు దెబ్బతింటున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికి తోడు సకాలంలో యూరియా లభించక పంటలు దెబ్బతింటున్నాయని వాపోతున్నారు. చెతికొస్తున్న పంటకు యూరియా అందక దిగుబడులు తగ్గే ప్రమాదం ఉన్నదని ఆందోళన చెందుతున్నారు.
మొన్నటి వరకు రాష్ట్రంలో యూరియా కొరత ఉన్నదంటూ పలు పత్రికల్లో వచ్చిన కథనాలను, ఫొటోలను వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు హేళన చేశారు. అదంతా ప్రతిపక్ష పార్టీలు కావాలనే రాద్దాంతం చేస్తున్నాయన్నట్టుగా మాట్లాడారు. తమ వద్ద ఎప్పుడు లేని విధంగా సుమారు 4 లక్షల టన్నుల యూరియా బఫర్ నిల్వలు ఉన్నాయని డబ్బా కొట్టారు. వాస్తవ పరిస్థితిని అంచనా వేయడంలో విఫలమయ్యారు. తీరా పది రోజుల తర్వాత చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా యూరియా కొరత పట్టి పీడిస్తున్నది. మార్క్‌ఫెడ్ వద్ద 4 లక్షల టన్నులు ఉన్నాయని చెప్పుకొన్న నిల్వలు, 50 వేలకు పడిపోయాయి. అదికూడా ఎక్కడెక్కడ ఉన్నదో తెలియని పరిస్థితి నెలకొన్నది. ఈ నిల్వలను కొరత ఉన్న చోటుకు తరలించేందుకు నానా తంటాలు పడుతున్నారు. ఇక్కడి స్టాక్‌ను అక్కడికి, అక్కడి స్టాక్‌ను ఇక్కడికి తిప్పుతున్నారు. కానీ కొరత మాత్రం తీరడం లేదు.
యూరియా కొరతపై ఒక్క మాటలో చెప్పాలంటే వ్యవసాయ శాఖ పూర్తిగా విఫలమైందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కేంద్రం నుంచి రావాల్సిన కోటాను సకాలంలో తేవడంలో వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు విఫలమవుతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కేంద్రం నుంచి రావాల్సిన కోటా రావడం లేదంటూ స్వయంగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావే అంగీకరించారు. కేంద్రం నుంచి 8.54 లక్షల టన్నుల యూరియా రావాల్సి ఉండగా 6.81 లక్షల టన్నులు మాత్రమే వచ్చినట్టు వెల్లడించారు. కోటా కన్నా 1.73 లక్షల టన్నుల యూరియా తక్కువ రావడం గమనార్హం. వాస్తవానికి బీఆర్ఎస్ హయాంలో నాటి సీఎం కేసీఆర్ అధికారులను ముందస్తుగా అలర్ట్ చేసి ఢిల్లీకి పంపి కేంద్రంతో సంప్రదింపులు జరిపించేవారు. కొన్నిసార్లు అధికారులు 3,4 రోజులు ఢిల్లీలోనే ఉండి రాష్ర్టానికి అవసరమైన కోటాను విడుదల చేయించుకునే వారు. కానీ ప్రస్తుతం ఈ విధానం లేదని తెలిసింది. ఇక్కడ వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్‌రావు జీఏడీ పొలిటికల్ బాధ్యతలతో బీజీ అయిపోగా డైరెక్టర్ గోపి రెండు అదనపు శాఖలతో బీజీ అయ్యారు. దీంతో ఢిల్లీ వెళ్లి కేంద్రంతో మాట్లాడేవారే కరువయ్యారనే విమర్శలున్నాయి. ఇలాకేంద్రం నుంచి ఎరువులు తేవడం, ఇక్కడి నిల్వలను పర్యవేక్షించడంలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
హైదరాబాద్, ఫిబ్రవరి 24 (నమస్తే తెలంగాణ) : రైతులు యూరియా కోసం మండుటెండల్లో తంటాలు పడుతుంటే, రాష్ట్ర ప్రభుత్వం మొద్దు నిద్రలో ఉండటం దుర్మార్గమని మాజీ మంత్రి హరీశ్‌రావు ధ్వజమెత్తారు. జగిత్యాలలో యూరియా కోసం రైతులు తమ ఆధార్‌కార్డులను లైన్లలో పెట్టిన దృశ్యాలను సోమవారం తన ఎక్స్ ఖాతాలో ఉదహరిస్తూ సర్కార్ తీరుపై ఆగ్రహం వ్యక్తంచేశారు. మొన్న మహబూబాబాద్ జిల్లాలో యూరియా పంపిణీ కోసం పోలీసులు టోకెన్లు జారీ చేస్తే, నేడు జగిత్యాలలో రైతులు పాస్ బుకులు, ఆధార్ కార్డులు క్యూలో పెట్టిన పరిస్థితి నెలకొన్నదని దుయ్యబట్టారు. బీఆర్ఎస్ పాలనలో రైతే రాజుగా ఉన్న తెలంగాణలో రైతులను నట్టేట ముంచి, నడిరోడ్డు మీదికి తెచ్చిన ఘనత సీఎం రేవంత్‌రెడ్డికే దకుతుందని ఫైర్ అయ్యారు. రైతులకు అవసరమైన యూరియాను సరఫరా చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా ఫెయిలైందని విమర్శించారు. రైతు డిక్లరేషన్ అని దగా చేసి, రుణమాఫీ, రైతు భరోసా, పంట బోనస్ పేరిట మోసం చేశారని, దేశానికి అన్నంపెట్టే రైతన్న కంటనీరు పెట్టిస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం కండ్లు తెరిచి రైతాంగానికి యూరియాను సరఫరా చేయాలని డిమాండ్ చేశారు.