భారతీయులు పవిత్రంగా భావించే ‘తులసి’ ఇప్పటికే మన దేశంలో ఆయుర్వేద ఔషధాల్లో ప్రసిద్ధి చెందింది. అయితే, మనుషుల సంపూర్ణ ఆరోగ్యానికి ‘తులసి’ దోహదపడుతున్నదని ‘అమెరికా నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్’ తన పరిశోధనలో తేల్చింది. తులసి జ్ఞాపకశక్తిని మెరుగుపర్చడంతో పాటు రోగనిరోధక శక్తిని పెంపొందిస్తున్నట్టు తాజాగా వెల్లడించింది. దీంతో తులసి మొక్క ప్రాముఖ్యత గ్లోబల్ స్థాయికి చేరినట్లయింది.
Tulasi | హైదరాబాద్, మే 1 (నమస్తే తెలంగాణ): తులసి వివిధ రకాల ఒత్తిళ్లను తగ్గించడంతో పాటు రద్దీ ప్రదేశాల్లో నివాసం ఉండేవారిని కాలుష్యం నుంచి కాపాడుతున్నట్టు నివేదిక స్పష్టం చేసింది. పనిచేయడం వల్ల కలిగే శ్రమ, చలి, పెద్ద శబ్దాల నుంచి ఉపశమనం కలిగించడంతో పాటు శరీర సమతుల్యతకు తోడ్పాటు అందిస్తున్నట్టు పేర్కొంది. బీపీ, రక్తంలో చక్కెరలు, కొలెస్ట్రాల్ లెవెల్స్‌ను తగ్గిస్తున్నట్టు పరిశోధనలో తేలింది. డయాబెటిస్, గుండె సంబంధిత వ్యాధులతో బాధపడేవారికి మంచి ప్రత్యామ్నాయంగా ఉపయోగపడుతున్నదని తెలిపింది. రక్తంలో గ్లూకోజ్‌ను తగ్గించడంతో పాటు లిపిడ్ ప్రొఫైల్‌ను మెరుగుపర్చడం, మానవ శరీరంలోని జీవన క్రియలను పెంపొదిస్తున్నట్టు ఆ నివేదిక వెల్లడించింది.
యాంటీ బ్యాక్టరీయా గుణాలు ఉన్న తులసి అనేక రకాల వైరస్‌లతో పోరాడుతున్నదని, జలుబును నివారించడంతోపాటు హ్యాండ్ శానిటైజర్, మౌత్ వాష్‌గా పనిచేస్తున్నట్టు ఆ పరిశోధనలో వెల్లడైంది. యాంటీ వైరల్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాల కారణంగా రోగాల బారిన పడకుండా కాపాడుతున్నదని నివేదిక పేర్కొంది. మనిషి సానుకూల దృక్పథంతో ఉండేందుకు, ఆందోళన, డిప్రెషన్‌కు గురికాకుండా పనిచేస్తున్నట్టు తెలిపింది. మనిషిలో ఒత్తిడిని తగ్గించేందుకు మెదడులోని రసాయనాలైన డొపమైన్, సెరొటొనిన్ను బ్యాలెన్స్ చేస్తున్నట్టు నివేదిక స్పష్టం చేసింది.
మన దైనందిన జీవనంలో రేడియషన్ల వల్ల కలిగే నష్టం నుంచి మన శరీరాన్ని రక్షించడంలో తులసి సహాయపడుతుందని, హాని కలిగించే పదార్థాల నుంచి కాపాడటంలో భాగంగా కాలేయ ఎంజైమ్‌ల ఉత్పత్తికి తోడ్పాటునందిస్తున్నట్టు నివేదిక వెల్లడించింది. ఈ చర్యతో మన శరీరంలో డీఎన్ఏకు కలిగే నష్టాన్ని తగ్గించి జీవకణాల ఆరోగ్యానికి బాసటగా నిలుస్తున్నట్టు స్పష్టం చేసింది. తులసిలో ఉండే యాంటీ ఇన్ఫ్లామెటరీ, యాంటీయాక్సిడెంట్ల కారణంగా గాయాలను త్వరగా తగ్గిస్తుందని పేర్కొంది. అల్సర్ నిరోధక ప్రభావాలు కలిగి ఉండటం, జీర్ణక్రియ సమస్యలు, కడుపునొప్పి, వాంతులు, విరేచనాల నుంచి ఉపశమనం కలిగిస్తున్నట్టు తెలిపింది. రక్తంలోని లిపిడ్‌ను తగ్గించడం ద్వారా గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడటంతో పాటు గుండెపోటు రిస్క్‌ను తగ్గిస్తుందని ‘అమెరికా నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్’ తన పరిశోధనలో వివరించింది.