హైదరాబాద్, సెప్టెంబర్29 (నమస్తే తెలంగాణ): మెడికల్ కాలేజీల్లోని బోధనా సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యలన్నింటినీ ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని తెలంగాణ ప్రభుత్వ బోధనా వైద్యుల సంఘం(టీటీజీడీఏ) నేతలు డిమాండ్ చేశారు. యూనియన్ రాష్ట్ర స్థాయి సమావేశాన్ని ఆదివారం హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు బోధనా వైద్యులు మాట్లాడుతూ.. పెరిఫెరల్ మెడికల్ కాలేజీ అలవెన్స్‌ను త్వరగా అమలు చేయాలని, అడిషనల్ డీఎంఈలను ర్యెగులర్ పద్ధతిలో నియమించాలని, బదిలీలపై ఓ పాలసీ తీసుకువచ్చి రెగ్యులర్ చేయాలని కోరారు.
మెడికల్ కాలేజీ వైద్యులకు ప్రత్యేక జాబ్ చార్ట్ రూపొందించాలని, సివిల్ అసిస్టెంట్ సర్జన్లను త్వరగా నియమించాలని, పని గంటలపై స్పష్టత ఇవ్వాలని, దవాఖానల అడ్మినిస్ట్రేటర్ల వైద్య యూనియన్ నేతలను టార్గెట్ చేయరాదని, ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటుతోపాటు మౌలిక వసతుల కల్పన, వైద్య సహాయ సిబ్బంది నియామకాలపై కూడా దృష్టి సారించాలని వారు డిమాండ్ చేశారు.