TTD | హైదరాబాద్, నవంబర్ 23 (నమస్తే తెలంగాణ): 2024 ఫిబ్రవరి నెలకు సంబంధించి తిరుమల శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం రూ.300 టికెట్లను శుక్రవారం విడుదల చేయనున్నట్టు టీటీడీ వెల్లడించింది. ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో దర్శనం టికెట్లను అందుబాటులో ఉంచనున్నట్లు ప్రకటించింది. వసతులకు సంబంధించిన కోటాను విడుదల చేయనున్నది.
మధ్యాహ్నం 3 గంటలకు ఫిబ్రవరి నెలకు సంబంధించి అద్దెగదుల టికెట్లు విడుదల చేస్తుంది. 2024 ఫిబ్రవరి 16న రథసప్తమి పర్వదినానికి సంబంధించి శ్రీవారి సేవ స్లాట్లను ఈ నెల 27న ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో విడుదల చేయనున్నది. జనవరి, ఫిబ్రవరి నెలలకు సంబంధించి శ్రీవారి సేవ, నవనీత సేవ కోటాను 27న మధ్యాహ్నం 12 గంటలకు విడుదల చేయనున్నది. అదేరోజు మధ్యాహ్నం 3గంటలకు పరకామణి సేవ కోటాను విడుదల చేస్తుంది. ఈ సేవలను https://ttdevasthanams.ap.gov.in/ వెబ్సైట్లో భక్తులు బుక్ చేసుకోవచ్చు.