హైదరాబాద్, జూన్ 21 (నమస్తే తెలంగాణ): మూడు నుంచి తొమ్మిది రోజుల పాటు భక్తులకు శ్రీవారి సేవ చేసేందుకు టీటీడీ అవకాశం కల్పిస్తున్నది. శ్రీవారి సేవ, లడ్డూ ప్రసాదం సేవ, పరకామణి సేవ, భక్తుల సంక్షేమ సేవ ఉంటాయి. కొత్తగా నవనీత సేవను కూడా తీసుకొచ్చారు. స్వామివారికి భక్తులు హుండీలో సమర్పించిన కానుకలు, ముడుపుల లెక్కింపు కోసం పరకామణికి తరలిస్తారు. ఆ లెక్కింపులో పాల్గొనడాన్నే పరకామణి సేవ అంటారు. పరకామణి సేవకు వెళ్లాలనుకొనే భక్తులు ముందుగానే srivariseva.tirumala.org వెబ్సైట్లో బుక్ చేసుకోవాలి.
ప్రభుత్వ రంగంలో పనిచేస్తోన్న ఉద్యోగులు, పదవీ విరమణ పొందిన ఉద్యోగులు ఈ సేవకు అర్హులు. వయస్సు 25 నుంచి 65 ఏండ్ల మధ్య ఉండాలి. సేవలో పాల్గొనాలనుకొనే భక్తులు ఎవరైనా సరే బృందంగా కాకుండా వ్యక్తిగతంగా మాత్రమే తమ పేర్లను నమోదు చేసుకోవాలని టీటీడీ సూచించింది. సేవ కోసం నమోదు చేసుకున్న తరువాత ఆ ఆన్లైన్ కాపీ, ఆధార్ కాపీ, రెండు ఫోటోలు, మీ ఉద్యోగానికి సంబంధించిన గుర్తింపు కార్డు వెంట తీసుకెళ్లాలి. శ్రీవారి సేవకులుగా మారిన తరువాత తెలుపు రంగు వస్ర్తాలు ధరించి పరకామణి సేవలో పాల్గొనాలి.