TVK Vijay : తమిళనాడులోని మహిళలకు డీఎంకే ప్రభుత్వం రూ.5,000 అకౌంట్లో వేసిన సంగతి తెలిసిందే. అయితే, ఈ అంశంపై టీవీకే పార్టీ అధినేత, నటుడు విజయ్ స్పందించారు. ఎప్పుడూ లేనిది ఇప్పుడు ఒకేసారి అడ్వాన్స్‌గా డబ్బులు వేయడం ఏంటని ప్రశ్నించారు. అంతేకాదు.. మహిళలు ఆ డబ్బులు తీసుకుని, తన పార్టీ టీవీకేకు అండగా నిలవాలని సూచించారు. తన విజిల్ గుర్తు అధికార పార్టీని భయపెడుతోందని, అందువల్లే ఈ డబ్బులు పంపిణీ చేశారని విజయ్ అభిప్రాయపడ్డారు.
మహిళలకు ప్రతి నెలా ఇవ్వాల్సిన రూ.1,000ని ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ నెలలకు సంబంధించి రూ.3 వేలతోపాటు, సమ్మర్ బొనాంజా కింద మరో రూ.2,000 కలిపి రూ.5 వేలు అకౌంట్లలో వేశారు. అయితే, వచ్చ వేసవిలో జరగనున్న ఎన్నికల్లో మహిళా ఓటర్లను ఆకట్టుకునేందుకే డీఎంకే ఆధ్వర్యంలోని స్టాలిన్ ప్రభుత్వం ఈ పని చేసిందని టీవీకే సహా ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ మేరకు ఎక్స్ వేదికగా విజయ్ ఈ అంశంపై స్పందించారు. ‘‘సడెన్‌గా సమ్మర్ బొనాంజా పేరిట రూ.2 వేలు అదనంగా ఎందుకిచ్చారు. ఇది ప్రజల డబ్బుతో ఓట్లను కొనుగోలు చేయడమే. ప్రతి ఏడాది సమ్మర్ వస్తుంది కదా.. కానీ, ఈసారి మాత్రమే అదనంగా డబ్బులు అకౌంట్లో వేశారు. ప్రతి నెలా రూ.15వ తారీఖున పడే డబ్బులు ఈసారి మాత్రం 13వ తేదీనే ఎందుకు ఇచ్చారు..?
புதிதாகக் கோடைக் காலச் சிறப்புத் தொகை ரூ.2000 எனத் திடீரென அறிவித்தது எப்படி? இந்த ஆண்டு மட்டும்தான் கோடைக் காலம் வருகிறதா என்ன?
வழக்கமாக மாதந்தோறும் 15ஆம் தேதி வரவு வைக்கப்படும் மகளிர் உரிமைத் தொகை, குறிப்பாக இன்று 13ஆம் தேதி வரவு வைக்கப்பட்டு அறிவிக்கப்படுவது ஏன்?…
— TVK Vijay (@TVKVijayHQ) February 13, 2026
కారణం మా విజిల్ గుర్తు. ప్రతి ఇంట్లో, వీధిలో విజిల్ శబ్దాలు మోగుతున్నాయి. ఆ భయంతోనే మహిళలకు డబ్బులు ఇచ్చారు. మేం బలమైన రాజకీయ శక్తిగా ఎదుగుతున్నామని, విజయం సాధించబోతున్నామని, ప్రభుత్వంతో బాగా పని చేయించగలమని దీని ద్వారా రుజువైంది. నేను మంచి పాలన అందిస్తా. నాకు అనుభవం ఉందా అని అడుతున్నారు. మీకు మాత్రం అవినీతిలో తప్ప అనుభవం ఉందా’’ అని విజయ్ ప్రశ్నించారు. డీఎంకే ప్రభుత్వం వేసిన డబ్బులు తీసుకుని, తమ పార్టీకి అండగా నిలవాలని కోరాడు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ విజయ్ దూకుడు పెంచారు.
అధికార డీఎంకేతోపాటు కేంద్రంలోని బీజేపీపై కూడా విమర్శలు గుప్పిస్తున్నారు. వరుసగా ప్రచార కార్యక్రమాలతో దూసుకెళ్తున్నారు. మరోవైపు అధికార డీఎంకే మాత్రం తమ ఓటు బ్యాంకును కాపాడుకునేందుకు ప్రయత్నిస్తోంది.