హైదరాబాద్, మే 29 (నమస్తే తెలంగాణ): హత్యాయత్నం కేసులో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) డిప్యూటీ ఈఈ శ్రీలక్ష్మిని బుధవారం అలిపిరి పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమె భర్త గిరీశ్చంద్రారెడ్డి, మరో ఇద్దరిని కూడా పోలీసులు అరెస్టు చేసి కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఈ నెల 25న తిరుపతి ఎన్జీవో కాలనీలో నివాసముండే వెంకటశివారెడ్డిపై హత్యాయత్నం జరిగింది. ప్రాణాపాయ స్థితిలో ఓ ప్రైవేటు దవాఖానలో బాధితుడు చికిత్స పొందుతున్నారు. అపార్ట్మెంట్ ముందే బైక్‌తో శివారెడ్డిని అడ్డగించి ఇద్దరు వ్యక్తులు ఆయనపై దాడి చేసినట్టు సీసీ కెమెరాలో రికార్డయ్యింది. అపార్ట్మెంట్లో వెంకటశివారెడ్డి ఫ్లాట్‌కు ఎదురుగా నివాసముండే శ్రీలక్ష్మి దంపతులు ఆయనతో గతంలో అనేకసార్లు గొడవకు దిగారు. ఈ విషయాన్ని సీసీ కెమెరాలో గుర్తించిన పోలీసులు.. విచారణ అనంతరం నలుగురిని అదుపులోకి తీసుకున్నారు.