హైదరాబాద్, జూన్10 (నమస్తే తెలంగాణ): బదిలీలపైన ఉన్న నిషేధాన్ని తొలగించి గురుకులాల్లో వెంటనే అధ్యాపకుల, ఉద్యోగుల బదిలీలను, పదోన్నతులను చేపట్టేందుకు మార్గం సుగమం చేయాలని ప్రభుత్వాన్ని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల ఉపాధ్యాయ, ఉద్యోగుల సంఘం (టీఎస్‌డబ్ల్యూఆర్‌టీఈఏ) డిమాండ్ చేసింది. ఈ మేరకు సోమవారం సంఘం అధ్యక్షుడు బాలరాజు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దయాకర్ సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. జనరల్, బీసీ, మైనార్టీ గురుకులాలలో 2018, 2019లో ఉద్యోగంలో చేరిన వారికి పదోన్నతులు లభించాయని, కానీ ఎస్సీ గురుకులాల్లో సిబ్బందికి ఇప్పటికీ పదోన్నతులు లేవని వెల్లడించారు.
గురుకుల సంస్థలో బదిలీలను నిషేధిస్తూ గతంలో ఉత్తర్వులు జారీ చేశారని, ఫలితంగా గత ఆరేండ్లుగా బదిలీలు చేపట్టలేదని తెలిపారు. దీంతో ఏండ్ల తరబడి మారుమూల ప్రాంతాల్లోని గురుకులాల్లోనే ఉపాధ్యాయులు, ఉద్యోగులు పనిచేయాల్సి వస్తున్నదని తెలిపారు. బదిలీలకు ముందుగా కొత్తగా నియామకాలు చేపడితే మరింత నష్టపోతారని, మెరుగైన ప్రాంతాలను కోల్పోవాల్సి వస్తుందని పేర్కొన్నారు. అదీగాక సీనియర్ ఉపాధ్యాయులు జూనియర్‌గా మారే ప్రమాదం ఉన్నదని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం, సీఎం రేవంత్‌రెడ్డి వెంటనే స్పందించి ట్రిబ్ ద్వారా కొత్త నియామకాలు చేపట్టేందుకు ముందుగానే గురుకులాల్లో బదిలీలు, పదోన్నతులను విద్యాశాఖతో పాటే పూర్తి చేయాలని కోరారు.