హైదరాబాద్, మే 28 (నమస్తే తెలంగాణ): లోక్సభ ఎన్నికలు, గ్రాడ్యుయేట్ ఉపఎన్నిక ముగిసిన నేపథ్యంలో ఎన్నికల కమిషన్ అనుమతి తీసుకొని ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులను వెంటనే చేపట్టాలని టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర నాయకులు జంగయ్య, చావ రవి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈనెల 15న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆదేశాల మేరకు యూఎస్పీసీ, జాక్టో ప్రతినిధులు విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశంతో జరిపిన చర్చల్లో ఈసీ అనుమతితో బదిలీలు, పదోన్నతుల షెడ్యూల్ విడుదల చేస్తామని హామీ ఇచ్చినట్టు తెలిపారు.
ఇప్పటివరకు ఈ అంశంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని వాపోయారు. కనీసం ఈసీకి ప్రభుత్వం ఎలాంటి లేఖ పంపలేదని, బదిలీల, పదోన్నతులకు షెడ్యూల్ ఇవ్వడం చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ వైఖరిపై నిరసన తెలుపుతున్నామని పేర్కొన్నారు. ప్రస్తుతం విద్యాశాఖలో 22వేల ఉపాధ్యాయ, గురుకులాల్లో 9,200, పార్టు టైమ్, గెస్ట్, అవుట్ సోర్సింగ్ పేరుతో మరో 12 వేల పోస్టులు ఖాళీగా ఉన్నాయని, వాటిని వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.