హైదరాబాద్, మార్చి 21 (నమస్తే తెలంగాణ) : ట్రాఫిక్ సూపర్వైజర్ ట్రైనీ (టీఎస్టీ), మెకానికల్ సూపర్వైజర్ ట్రైనీ (ఎంఎస్టీ) పోస్టుల భర్తీకి తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఆదివారం ప్రకటన విడుదల చేసింది. 198 ఖాళీల భర్తీ కోసం ఈ నెల 29న రాత పరీక్ష నిర్వహించనున్నట్టు బోర్డు చైర్మన్ వీవీ శ్రీనివాసరావు తెలిపారు. ఆదివారం రెండు సెషన్లలో పరీక్షలు జరుగనున్నట్టు చెప్పారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు.. మధ్యాహ్నం 2:30 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు ఉంటుందని తెలిపారు.
అభ్యర్థులు హాల్‌టికెట్లను ఈ నెల 23న ఉదయం 8 నుంచి 28 అర్ధరాత్రి 12 గంటల వరకు అధికారిక వెబ్సైట్ www.tgprb.in ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చని సూచించారు. హాల్‌టికెట్ డౌన్లోడ్ చేయడంలో ఇబ్బందులు ఎదురైతే, అభ్యర్థులు support@tslprb.inకు ఈ-మెయిల్ చేయవచ్చని, 9391005006 నంబర్‌ను సంప్రదించవచ్చని తెలిపారు. ఫొటో లేని హాల్‌టికెట్లను అనుమతించబోమని పేర్కొన్నారు. అభ్యర్థుల వేలిముద్రలు, డిజిటల్ ఫొటోలను సేకరిస్తారు కాబట్టి.. చేతులకు మెహందీ, టాటూలు ఉండకూడదని బోర్డు స్పష్టంచేసింది.