TGSRTC | హైదరాబాద్, ఆగస్టు 18 (నమస్తే తెలంగాణ): రాష్ట్రసర్కారుపై ఆర్టీసీ కార్మికులు జంగ్‌సైరన్ మోగించారు. పెండింగ్ డిమాండ్లపై ప్రభుత్వంతో తేల్చుకునేందుకు ఆర్టీసీ జేఏసీ సిద్ధమవుతున్నది. ఎన్నికల మ్యానిఫెస్టోలో పెట్టిన అంశాలను వెంటనే అమలు చేయాలని కోరుతూ దశలవారీగా ఆందోళనలు చేపట్టాలని నిర్ణయించినట్టు జేఏసీ చైర్మన్ ఈదురు వెంకన్న ఆదివారం ప్రకటించారు.
ఈనెల 27న రాష్ట్రవ్యాప్తంగా ‘నల్లబ్యాడ్జీలతో’ నిరసన చేపట్టనున్నట్టు తెలిపారు. సెప్టెంబర్ 10న హామీలను అమలు చేయాలని కోరుతూ ‘డిమాండ్ డే ’ పేరిట నల్లబ్యాడ్జీలతో విధులు నిర్వహించనున్నట్టు చెప్పారు. అక్టోబర్ 1న ఇందిరాపార్క్ వద్ద సామూహిక నిరాహార దీక్షలు చేపట్టనున్నట్టు చెప్పారు. ఈ కార్యక్రమాలను విజయవంతం చేయడంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని డిపోల్లో వెంటనే జేఏసీలను ఏర్పాటు చేయాలని వెంకన్న పిలుపునిచ్చారు.
టీజీఎస్ఆర్టీసీలో కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో ఆర్టీసీ యాజమాన్యం నిర్లక్ష్య ధోరణి అవలంబిస్తున్నదని ఆర్టీసీ జేఏసీ భావిస్తున్నది. కార్మికులపై రోజురోజుకూ పనిభారం మోపుతూ వేధింపులకు గురి చేస్తున్నదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో శనివారం జేఏసీ తరఫున 40 అంశాలతో కూడిన మెమోరాండాన్ని ప్రభుత్వానికి అందజేశారు.
రవాణాశాఖ మంత్రి, ఆర్టీసీ ఎండీ, రవాణాశాఖ కమిషనర్‌ను కలిసి ఈ మేరకు ఆర్టీసీ జేఏసీ డిమాండ్లను వారి ముందు పెట్టారు. కొత్త బస్సులను కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నా, పట్టించుకోకుండా కాలయాపన చేస్తున్నదని మండిపడుతున్నారు. ప్రభుత్వం నుంచి కార్మికులకు రావాల్సిన బాండ్ల బకాయిలు రూ. 200కోట్లు, 2 పీఆర్సీ బకాయిలు, డీఏలు ఇప్పటి వరకు పరిష్కారం కాకపోవడం కార్మికుల్లో అసహనం పెంచుతున్నది.
ట్రేడ్ యూనియన్ల ఎన్నికలు నిర్వహించాలి
ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారానికి తక్షణమే ఆర్టీసీ ట్రేడ్ యూనియన్ల ఎన్నికలు నిర్వహించాలని ఆర్టీసీ జేఏసీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఆర్టీసీలో వెల్ఫేర్ బోర్డుల వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని, గుర్తింపు సంఘాల ఎన్నికలు నిర్వహిస్తేనే తమకు న్యాయం జరుగుతుందని పేర్కొంటున్నారు. ఎంటీడబ్ల్యూ యాక్ట్ ప్రకారం 8 గంటలు మాత్రమే డ్రైవర్లు, కండక్టర్లు పనిచేయాల్సి ఉండగా, ప్రస్తుతం 11 గంటలు, డబుల్ డ్యూటీలు చేయిస్తున్నారని వాపోతున్నారు. డబుల్ డ్యూటీ చేసిన కార్మికులకు ఎలాంటి అదనపు అలవెన్సులు చెల్లించడం లేదని మండిపడుతున్నారు. పీఆర్సీ బకాయిలు, డీఏ బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు.