TSRTC | ప్రజలకు మెరుగైన నాణ్యమైన సేవలు అందించేందుకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కృషి చేస్తున్నది. ఎప్పటికప్పుడు రవాణారంగంలో వస్తున్న మార్పులను అందిపుచ్చుకుంటూ.. వినూత్న పద్ధతుల్లో ప్రయాణికులకు చేరువవుతున్నది. ఈ క్రమంలోనే ప్రయాణికుల సౌకర్యార్థం కొత్త బస్సులను కొనుగోలు చేస్తున్నది. ఈ ఆర్థిక సంవత్సరానికి రూ.400 కోట్ల వ్యయంతో 1,050 కొత్త డీజిల్ బస్సులను కొనుగోలు చేయాలని నిర్ణయించింది.
ఇందులో 400 ఎక్స్‌ప్రెస్, 512 పల్లె వెలుగు, 92 లహరి స్లీపర్ కమ్ సీటర్, మరో 56 ఏసీ రాజధాని బస్సులను కొనుగోలు చేయనున్నది. వీటికి తోడు పర్యావరణ హితమైన ఎలక్ట్రిక్ వాహనాలను హైదరాబాద్ సిటీలో 540, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో 500 బస్సులను అందుబాటులోకి తెచ్చేందుకు ఆర్టీసీ యాజమాన్యం చర్యలు చేపడుతున్నది. కొత్త బస్సులన్నీ విడుతలవారీగా వచ్చే ఏడాది మార్చి నాటికి ప్రయాణికులకు అందుబాటులోకి తేవాలని ప్రణాళికలు రూపొందించింది.
ప్రస్తుతం మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ఉచిత ప్రయాణం నేపథ్యంలో బస్సుల్లో రద్దీ పెరిగింది. ఈ క్రమంలో అత్యాధునిక హంగులతో 80 కొత్త బస్సులు శనివారం రోడ్డిక్కించేందుకు చర్యలు చేపట్టింది. ఇందులో 30 ఎక్స్‌ప్రెస్, 30 రాజధాని ఏసీ, 20 లహరి స్లీపర్ కమ్ సీటర్ (నాన్ ఏసీ) బస్సులున్నాయి. ఆయా బస్సులను హైదరాబాద్ నగరంలోని ఎన్టీఆర్ మార్గ్‌లోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఉదయం 10 గంటలకు రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, సంస్థ ఎండీ వీసీ సజ్జనార్ ప్రారంభించనున్నారు.