TSRTC | తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ వివిధ స్కీమ్స్‌తో ప్రయాణికులను ఆకట్టుకుంటూ ఆదాయాన్ని పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నది. ఇప్పటికే పలు ప్రత్యేకంగా టికెట్స్‌ను ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ క్రమంలో తాజాగా ‘T9-30’ పేరుతో స్పెషల్ టికెట్‌ను ప్రకటించింది. ప్రస్తుతం T9-60 టికెట్ అందుబాటులో ఉండగా.. ప్రయాణికులపై భారాన్ని తగ్గించేందుకు T9-30 టికెట్‌ను ప్రవేశపెట్టింది. హైదరాబాద్‌లోని బస్ భవన్లో బుధవారం ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్దన్‌రెడ్డి, సంస్థ ఎండీ వీసీ సజ్జనార్ టీ9-30 టికెట్‌ను ఆవిష్కరించారు.
రూ.50 ప్రయాణికులు టికెట్‌ను కొనుగోలు చేస్తే 30 కిలోమీటర్ల పరిధిలో వచ్చేపోయే వెసులుబాటు ఉంటుందని వారు తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు ఈ టికెట్ చెల్లుబాటవుతుందని పేర్కొన్నారు. ఈ నెల 27 నుంచి టికెట్ అమలులోకి వస్తుందని, పల్లె వెలుగు బస్‌లో కండక్టర్ల వద్ద టికెట్ అందుబాటులో ఉంటుందని వివరించారు. తక్కువ దూరం ప్రయాణించే ఉద్యోగులతో పాటు కార్మికులు, ఇతర ప్రయాణికులకు సైతం ఈ టికెట్ ఉపయుక్తంగా ఉంటుందని ఆర్టీసీ అధికారులు పేర్కొన్నారు. 30 కిలోమీటర్ల పరిధిలో ఉన్న ఇతర రాష్ట్రాలు వెళ్లి వచ్చేందుకు సైతం టికెట్ వర్తిస్తుందని ఆర్టీసీ చెప్పింది. టికెట్ ద్వారా ఒక్కొక్కరికి రూ.10 నుంచి రూ.30 వరకు ఆదా అవుతుందని తెలిపింది.
ఈ టికెట్ తీసుకున్న ప్రయాణికులు తిరుగు ప్రయాణంలో రూ.20కాంబినేషన్ టికెట్ తీసుకొని ఎక్స్‌ప్రెస్ బస్సుల్లోనూ ప్రయాణించేందుకు అవకాశం ఉందని వెల్లడించింది. నెల రోజుల పాటు టికెట్ అందుబాటులో ఉంటుందని, ఆ తర్వాత ప్రయాణికుల నుంచి వస్తున్న స్పందనను బట్టి పొడిగింపుపై సంస్థ నిర్ణయం తీసుకోనున్నది. అయితే, ఇటీవల తీసుకువచ్చిన టీ9-60 టికెట్‌ను పల్లె వెలుగు బస్సుల్లో ప్రయాణించే వారికి సైతం వర్తింపజేస్తున్నట్లు బాజిరెడ్డి, సజ్జనార్ తెలిపారు. మహిళలు, సీనియర్ సిటిజన్స్ కోసం తీసుకువచ్చిన టికెట్‌ను గురువారం నుంచి పురుష ప్రయాణికులకు సైతం అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు.
గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో స్వల్ప దూరం ప్రయాణించే వారి కోసం మరో రాయితీ పథకాన్ని #TSRTC ప్రకటించింది. పల్లె వెలుగు బస్సు ప్రయాణికుల సౌకర్యార్థం కొత్తగా ‘టి9-30 టికెట్’ ను అందుబాటులోకి తెచ్చింది. ఇప్పటికే టి9-60 వాడకంలో ఉండగా.. ప్రయాణికుల ఆర్ధిక భారం తగ్గించేందుకు తాజాగా టి9-30… pic.twitter.com/hA5W0ArowL
— VC Sajjanar – MD TSRTC (@tsrtcmdoffice) July 26, 2023