TSRTC | హైదరాబాద్, డిసెంబర్ 30 (నమస్తే తెలంగాణ): నిధుల సమీకరణ కోసం సంస్థ భూములను లీజుకు ఇవ్వాలని టీఎస్ ఆర్టీసీ నిర్ణయించింది. జీహెచ్ఎంసీ పరిధిలో సంస్థకు ఉన్న భూముల్లో 13.16 ఎకరాలు లీజుకు ఇచ్చేందుకు సిద్ధమైంది. కాచిగూడలో 4.14 ఎకరాలు, మేడ్చల్లో 2.83 ఎకరాలు, శామీర్పేటలో 3.26 ఎకరాలు, హకీంపేటలో 2.93 ఎకరాలు లీజుకు ఇచ్చేందుకు ఆన్లైన్లో టెండర్ దరఖాస్తులను ఆహ్వానించింది.
జనవరి 18 వరకు టెండర్లు దాఖలు చేసుకోవడానికి అవకాశం కల్పించింది. ఆ మరుసటి రోజే టెండర్ ఫలితాలు ప్రకటిస్తామని స్పష్టంచేసింది. టెండర్ దక్కించుకున్న సంస్థ మాత్రమే లీజుతో అక్కడ వ్యాపార లావాదేవీలను నిర్వహించాలని, ముందస్తు అనుమతి లేకుండా సబ్ లీజుకు ఇవ్వడం కుదరదని నిబంధనల్లో సంస్థ పేర్కొన్నది. కనీసం రూ.100 కోట్ల టర్నోవర్ కలిగిన సంస్థలకు అవకాశం ఇవ్వాలని టీఎస్ ఆర్టీసీ భావిస్తున్నట్టు తెలిసింది. టెండర్ వివరాల కోసం https://www.tsrtc.telangana.gov.in వెబ్సైట్లో సంప్రదించాలని సూచించింది.