హైదరాబాద్, జనవరి 18 (నమస్తే తెలంగాణ): ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన టీఎస్ఆర్టీసీ తాండూరు డిపో కండక్టర్ లక్ష్మణ్ కుటుంబానికి సంస్థ యాజమాన్యం అండగా నిలిచింది. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (యూబీఐ) సహకారంతో రూ.40 లక్షల బీమా సొమ్మును అందించి బాధిత కుటుంబానికి భరోసా కల్పించింది.
హైదరాబాద్ బస్‌భవన్‌లో గురువారం కండక్టర్ లక్ష్మణ్ భార్య జ్యోతి, కుమారుడు అనిల్‌కుమార్‌కు రూ.40 లక్షల విలువైన చెకును యూబీఐ అధికారులతో కలిసి ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ అందజేశారు. యూబీఐ సూపర్ వేతన సేవింగ్ అకౌంట్ ద్వారా ఉచిత ప్రమాద బీమా కింద ఈ సొమ్మును బాధిత కుటుంబానికి అందజేశారు.