TSRTC | హైదరాబాద్, మే 12 (నమస్తే తెలంగాణ) : సార్వత్రిక ఎన్నికల వేళ సంక్రాంతి రికార్డును టీఎస్ఆర్టీసీ బ్రేక్ చేసింది. సంక్రాంతి సీజన్‌తో పోలిస్తే 10శాతానికి పైగా ప్రయాణికులు ఆర్టీసీని వినియోగించుకొన్నారని టీఎస్ఆర్టీసీ తెలిపింది. ఈ నెల 9 నుంచి 11 వరకు సుమారు 1.42 కోట్ల మందికిపైగా ప్రయాణించారని వెల్లడించింది. ఎన్నికల నేపథ్యంలో ఓటు వేసేందుకు సొంతూళ్లకు వెళ్లే వారి కోసం టీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది.
ఏపీ వైపునకు ఇప్పటివరకు 590 స్పెషల్ బస్సులను ఏర్పాటు చేయగా.. తాజాగా హైదరాబాద్ విజయవాడ రూట్లో 140 సర్వీసులను ఆన్లైన్లో ముందస్తు రిజర్వేషన్ కోసం పెట్టింది. ఆయా బస్సుల్లో దాదాపు 3 వేలకుపైగా సీట్లు అందుబాటులో ఉన్నాయి. టికెట్ల ముందస్తు రిజర్వేషన్ కోసం http://tsrtconline.in వెబ్‌సైట్‌ను సంప్రదించాలని టీఎస్ఆర్టీసీ కోరింది. హైదరాబాద్ నుంచి జిల్లాలకు 1500 ప్రత్యేక బస్సులను టీఎస్ఆర్టీసీ నడుపుతున్నది. జేబీఎస్, ఎంజీబీఎస్, ఉప్పల్, ఎల్బీనగర్, ఆరాంఘర్ తదితర ప్రాంతాల నుంచి ఈ బస్సులు బయలుదేరుతున్నాయి.