TSPSC | హైదరాబాద్, మార్చి 23 (నమస్తే తెలంగాణ): కంప్యూటర్ హ్యాకింగ్, ప్రశ్నపత్రాల లీకేజీ కేసుతో రద్దయిన నాలుగు, వాయిదా వేసిన రెండు పరీక్షల తేదీలను వారం రోజుల్లో ప్రకటించాలని టీఎస్పీఎస్సీ భావిస్తున్నది. మే నెలలోనే ఆ పరీక్ష లు నిర్వహించాలని యోచిస్తున్నది. దీనికి సంబంధించిన ఏర్పాట్లపై కసరత్తు చేస్తున్నది. వీలైనన్ని ఎక్కువ పరీక్షలు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ) పద్ధతిలోనే నిర్వహించాలని నిర్ణయించింది. గురువారం టీఎస్పీఎస్సీ చైర్మన్ బీ జనార్దన్‌రెడ్డి నేతృత్వంలో కమిషన్ భేటీ జరిగింది.
ఇప్పటికే జూన్ 11న గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష నిర్వహిస్తామని ప్రకటించింది. మిగిలిన పరీక్షల తేదీల ప్రకటన, నిర్వహణ, సీబీటీ విధానం తదితర అంశాల గురించి చర్చించింది. సీబీటీ వి ధానంలో పరీక్ష నిర్వహించేందుకు ఏ ర్పాట్లు చేయాలని చైర్మన్ అధికారులకు సూచించగా, ఇప్పటికిప్పుడు అంటే సాధ్యం కాకపోవచ్చని, ఆగస్టు వరకు అయితే ఏర్పాట్లు చేస్తామని అధికారులు చెప్పినట్టు తెలిసింది.