హైదరాబాద్, అక్టోబర్ 6 (నమస్తే తెలంగాణ): గ్రూప్4 ఫైనల్ ‘కీ’ని శుక్రవారం టీఎస్పీఎస్సీ విడుదల చేసింది. దీంతోపాటు అభ్యర్థుల ఓఎంఆర్ షీట్లను కూడా తన అధికారిక వెబ్సైట్లో పొందుపరిచింది. పేపర్1లో ఏడు ప్రశ్నలను తొలగించిన అధికారులు మరో ఎనిమిది ప్రశ్నలకు ఆప్షన్ మార్చారు. పేపర్2లో మూడు ప్రశ్నలను తొలగించి, ఐదు ప్రశ్నలకు ఆప్షన్ మార్పు చేశారు. గ్రూప్4 క్యాటగిరీలో 8,039 ఉద్యోగాల భర్తీకి నిరుడు డిసెంబర్ 1న నోటిఫికేషన్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ పరీక్షకు అత్యధికంగా 9,51,205 దరఖాస్తులు నమోదయ్యాయి. గత జూలై 1న పరీక్ష జరగ్గా, పేపర్ -1కు 7,63,835 మంది, పేపర్ -2కు 7,61,026 మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఆగస్టు 28న ప్రిలిమినరీ కీని కమిషన్ విడుదల చేసింది. ప్రిలిమినరీ కీతోపాటు అభ్యర్థుల ఓఎంఆర్ షీట్లు, మాస్టర్ క్వశ్చన్ పేపర్‌ను వెబ్సైట్లో పొందుపరిచింది. ఆగస్టు 30 నుంచి సెప్టెంబర్ 4వరకు అభ్యంతరాలను స్వీకరించింది. తాజాగా ఫైనల్ కీని వెల్లడించింది. ఈ నెలలోనే గ్రూప్-4 ఫలితాలను విడుదల చేయనున్నది. వివరాలకు www.tspsc.gov.in వెబ్సైట్లో సంప్రదించవచ్చు.